Galam Venkata Rao | Published: Mar 25, 2025, 4:00 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వచ్చే మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు ప్రారంభిస్తామని తెలిపారు. స్కూళ్ల ప్రారంభానికి ముందే ప్రారంభించి.. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అందరికీ ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం కింద అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలో మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమై.. సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు పథకాలు గౌరవంగా అందించాల్సిన బాధ్యత కలెక్టర్ నుంచి చిట్టచివరి సిబ్బంది వరకు ఉందని తేల్చిచెప్పారు. ఇక, మెగా డీఎస్సీకి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పోస్టింగులు పూర్తిచేయాలని ఆదేశించారు.