vuukle one pixel image

చంద్రబాబు మార్గదర్శి.. అందుకే వెంట నడిచాం: పవన్ కళ్యాణ్ | P4: | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 31, 2025, 6:00 PM IST

పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే పీ-4 కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జీరో పేదరికం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం "జీరో పావర్టీ పీ-4 మార్గదర్శి-బంగారు కుటుంబం” కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పి-4 పథకం అంటే డబ్బులు ఇచ్చేయడం కాదని, పీ-4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్ షిప్ తో అభివృద్ధి సాధించడమని అన్నారు. ఈ పథకం కోసం 30 లక్షల కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేశామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వ్యాపార సంస్థలను వాటాలు అడిగితే.. కూటమి ప్రభుత్వం అట్టడుగున ఉన్న ప్రజలకు తమ ఎదుగుదలలో వాటాలు కల్పించమని అడుగుతోందన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ సరిగ్గా ఏడాది క్రితం నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ కార్యక్రమంలో పాల్గొన్నాం. తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలనేదే మా ఇద్దరి ఆకాంక్ష. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూడా కూటమిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కనుకే 164 శాసనసభ స్థానాలు, 21 పార్లమెంట్ సభ్యులను గెలిచాం. ప్రజలే కనుక అండగా నిలబడకపోతే ఇంతటి ఘన విజయం సాధ్యమయ్యేది కాదు. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులకు గురి చేసింది. వైసీపీ హయాంలో దాదాపు 34 మంది భవన నిర్మాణ కార్మికులు అధికారికంగా చనిపోతే అనధికారికంగా వందమందికి పైగా చనిపోయారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టే ఆ రోజు నిర్లక్ష్యానికి గురైన భవన నిర్మాణ కార్మికులను ఈ రోజు వేదికపై కూర్చొబెట్టాం. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు పని తీరుకు ఇదే నిదర్శనం. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేస్తే... ఒక నిజమైన నాయకుడు వచ్చే తరం కోసం ఆలోచన చేస్తాడు. చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకుడు కాబట్టే ఆయనకు అండగా నిలబడ్డాము. ఆయన ఒక తరం కోసం కాదు రెండు మూడు తరాల కోసం ఆలోచిస్తారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బయటపడేయగల శక్తి ఎవరికీ సరిపోయేది కాదు. ఎదుగుతున్న క్రమంలో మంచి సలహా ఇచ్చేవారు ఉండాలి. అలా ఇస్తే యువత అద్భుతాలు చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కాస్త ధైర్యం చెబితే చాలు.. వాళ్లకు కొండంత అండగా ఉంటుంది. మనమంతా చిన్నచిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్లమే. మనకు అవసరమైనప్పుడు చిన్న మాట సాయమో, ధన సాయమో ఆశిస్తాం.. వ్యక్తులుగా కొందరు చేస్తూ ఉంటారు. అటువంటి పని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టినందుకు ముఖ్యమంత్రి కి అభినందనలు. ఉగాది పర్వదినం రోజు ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఉగాది చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా... మన రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రం రూపుదిద్దుకుంటుంది. స్వర్ణాంధ్ర 2047 చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పీ-4 పథకం ఎంతో ఉపయోగపడుతుంది. నందమూరి తారక రామారావు నుంచి ఇక్కడ వేదిక మీద ఆశీనులైన పెద్దలు అందరూ చిన్న స్థాయి నుంచి వచ్చినవారే.. చంద్రబాబు నాయుడు సైతం చిన్న కుటుంబం నుంచే వచ్చారు. ఇక్కడ వేదిక మీద కూర్చొన్న మచ్చా ప్రకాశ్ తాను చదువుకోకపోయినా తన సోదరి చదువుకోవాలని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆలోచిస్తోంది... మచ్చా ప్రకాశ్ కూడా చదువుకోవాలని. సినిమాలో ఏదైనా సమస్యను రెండున్నర గంటల్లో పరిష్కారించవచ్చు. అయితే నిజ జీవితంలో అది సాధ్యం కాదు. ఒక విజనరీ నాయకుడు పూనుకుంటే పథకం ఎంత అద్బుతంగా ఉంటుందో ఇదే నిదర్శనం. ఈ పథకాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు" అని తెలిపారు.