
పాదాలు పగలడం చాలా సాధారణమైన సమస్య. కొంతమందికి ఎక్కువగా చలికాలంలో పాదాలు పగులుతుంటాయి. మరికొందరికి కాలంతో సంబంధం లేకుండా ఈ సమస్య ఎదురవుతుంది. పోషకాహార లోపం, థైరాయిడ్ సమస్యలు, చర్మ అలెర్జీలు, బరువు ఎక్కువగా ఉండటం, చెప్పులు వేసుకోకపోవడం, గరుకుగా ఉండే నేల మీద నడవడం, పాదాలను శుభ్రంగా కడుక్కోకపోవడం వంటివి పాదాలు పగలడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.
సాధారణంగా మనం ముఖానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ముఖం అందంగా ఉండడానికి రకరకాల చిట్కాలు పాటిస్తుంటాం. కానీ పాదాలను మాత్రం అంతగా పట్టించుకోము. అలా చేయడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖంలాగే పాదాల పట్ల కూడా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
పాదాలు పగిలినప్పుడు మొదట్లోనే శ్రద్ధ తీసుకోకపోతే.. తర్వాత అది పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలను సరిగ్గా చూసుకోకపోతే.. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతుందని అంటున్నారు. నిపుణుల ప్రకారం పాదాలు పగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పగిలిన పాదాలకు నిమ్మకాయ, తేనె చక్కగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి వాటిని ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
1. ముందుగా గోరువెచ్చని నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. ఒక గిన్నెలో ఒక చెంచా వాజిలిన్, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పగిలిన పాదాలకు రాసి మర్దన చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి. కావాలంటే నిమ్మరసంలో ఆలివ్ నూనె లేదా తేనె కూడా కలపవచ్చు.
2. నిమ్మకాయను నేరుగా పగిలిన చోట రుద్దాలి. పది నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో కడగాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
3. గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్ కలపాలి. ఈ నీటిలో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. కొన్ని నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో పాదాలను రుద్దాలి. తర్వాత పాదాలను కడిగి, శుభ్రమైన టవల్‌తో తుడవాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే మృత కణాలు తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి.
4. ఒక బకెట్‌లో గోరువెచ్చని నీరు పోసి, అందులో కొంచెం కలబంద జెల్, నిమ్మరసం కలపాలి. కావాలంటే టీ ట్రీ ఆయిల్, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కలపవచ్చు. ఈ మిశ్రమంలో పాదాలను 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత మృదువైన టవల్‌తో తుడ్చుకోవాలి. చివరగా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. కలబందజెల్, నిమ్మరసం పాదాలను మృదువుగా చేస్తాయి.
5. తేనెలో మాయిశ్చరైజింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. పాదాల పగుళ్లకు తేనె శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం తేనెని పాదాల పగుళ్లపై నేరుగా రాయచ్చు. తేనె రాసి 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. తేనె మాయిశ్చరైజర్‌లా పనిచేసి పాదాల పగుళ్లను తగ్గిస్తుంది.
6. ఆలివ్ ఆయిల్ కూడా పాదాల పగుళ్ల సమస్యను తగ్గిస్తుంది. అందుకోసం ముందుగా గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. అందులో 15 నిమిషాల పాటు పాదాలని ఉంచాలి. తర్వాత పాదాలను స్క్రబ్బర్‌తో రుద్దాలి. అనంతరం పాదాలను కడుక్కోవాలి. తడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఆలివ్ ఆయిల్ రాసి సాక్స్ వేసుకోవాలి. రాత్రంతా ఇలాగే ఉంటే త్వరలోనే మంచి ఫలితాలు చూడవచ్చు.
7. కొబ్బరినూనెలో యాంటీ మైక్రోబయల్, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. పాదాల పగుళ్లకు కొబ్బరినూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనెని కొద్దిగా వేడిచేసి పాదాలకు మర్దన చేయాలి. దీంతో పాదాలు మృదువుగా మారతాయి.
ఇవి గుర్తుంచుకోండి:
- ఈ పద్ధతులను క్రమంతప్పకుండా పాటిస్తే పాదాలు పగలడం తగ్గుతుంది.
- పాదాలను ఎప్పుడూ తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ వాడటం మంచిది.