
ఎండలు ఎంత మండిపోతున్నా.. కొన్ని ముఖ్యమైన పనులు, ఉద్యోగాల వల్ల బయటకు వెళ్లక తప్పదు. సూర్య కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటే ట్యాన్ సమస్య వస్తుంది. ఈ కిరణాలు చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని నల్లగా మారుస్తాయి. దీంతో స్కిన్ డల్ గా కనిపిస్తుంది. గ్లో తగ్గిపోతుంది. మీరు కూడా ఈ సన్ ట్యాన్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఖరీదైన క్రీములకు బదులుగా ఈ ఇంటి చిట్కాలు పాటించండి. మీ సమస్య ఈజీగా దూరమవుతుంది.
బంగాళదుంప రసం, తేనెతో ట్యాన్ తొలగింపు
చర్మంపై నలుపును తొలగించడానికి బంగాళదుంప రసాన్ని ఉపయోగించవచ్చు. బంగాళదుంప రసంలో కొద్దిగా తేనె కలపండి. నల్లగా ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాసుకోండి. 20 నుంచి 30 నిమిషాలపాటు ఆరనివ్వండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల సన్ ట్యాన్ తగ్గుతుంది.
మజ్జిగ, బియ్యం పిండి
బియ్యం పిండి చర్మంపై మృతకణాలను తొలగిస్తుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మీరు బియ్యం పిండి, మజ్జిగను కలిపి చర్మానికి రాసుకోవచ్చు. ఇది కూడా సన్ ట్యాన్ తొలగించడంలో సహాయపడుతుంది.
బాదం నూనె, వెనిగర్
బాదం నూనె, వెనిగర్ కలిపి రాసుకోవడం ద్వారా ట్యాన్ సమస్య తగ్గుతుంది. బాదం నూనె, వెనిగర్ సమానంగా కలిపి చర్మం నల్లబడ్డ చోట రాసుకోవాలి. బాదం నూనెలో విటమిన్ E ఉండటం వల్ల చర్మం తేమగా ఉంటుంది. వెనిగర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.
పాలు, శనగపిండి
స్నానం చేసే ముందు పాలు, శనగ పిండి కలిపి రాసుకుంటే ట్యాన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. పచ్చి పాలలో ఒక చెంచా శనగపిండి, చిటికెడు పసుపు కలపండి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న చోట రాసుకోండి. పాలలోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
మార్కెట్ లో దొరికే ఖరీదైన ప్రోడక్టులకు బదులు ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే కచ్చితంగా తక్కువ టైంలోనే మంచి ఫలితాలు చూడవచ్చు. డబ్బులు కూడా ఆదా అవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.