అమ్నీషియా పబ్ కేసు విషయంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. టీఆర్ఎస్ హయాంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ మండిపడ్డారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంలో ఆరేళ్ల పాపకు కూడా భద్రత లేదని వైఎస్ఆర్ టిపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… పదహారేళ్ల అమ్మాయికి, 60 ఏళ్ల బామ్మకు రక్షణ లేదని విమర్శించారు. బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులు దాటిందని.. ఇంతవరకు నిందితులను పట్టుకునే దిక్కులేదని మండిపడ్డారు. ఉన్నవాడికి చట్టం చుట్టం అయితే లేనోనికి న్యాయం బజార్లో దొరుకుతుందా? అంటూ వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్ రేప్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల బంధువులు ఉన్నారని మిత్రపక్షం ఎమ్మెల్యేల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం? అని వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు.
ఇది బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవమన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారని..తెలిపారు. డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్ ను మార్చారని దుయ్యబట్టారు. ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
undefined
ఇదిలా ఉండగా, హైదరాబాద్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా లోకం కదలాలి అన్నారు. నిందితులకు శిక్షపడేవరకు పోరాడాలని... మనల్ని మనం రక్షించుకుందాం అంటూ సీతక్క పిలుపునిచ్చారు.
కాగా రాజధాని నగరంలో శుక్రవారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లో పరిచయమైన ఒక బాలికపై ముగ్గురు బాలురు, ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు, వీరిలో ఒక ప్రభుత్వ సంస్థకు కొత్తగా చైర్మన్ గా ఎన్నికైన నాయకుడి కుమారుడు, అతని స్నేహితులు ఉన్నారు. వీరిలో ఒక బాలుడిని, సాదుద్దీన్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరు రోజుల కిందట ఈ ఘటన చోటు చేసుకోగా… భయంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు.
ఆమె శరీరంపై గాయాలు చూసి… తండ్రి ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక షాక్ నుంచి తేరుకున్నాక… భరోసా కేంద్రంలో మహిళా పోలీసులు బుధవారం రాత్రి ఆమెతో అనునయంగా మాట్లాడటంతో వాస్తవం బయటికొచ్చింది. తనపై కొందరు సామూహిక అత్యాచారం చేశారంటూ ఆమె విలపించింది. దీంతో పోలీసులు అత్యాచారం సెక్షన్లు జోడించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రజాప్రతినిధుల సంతానమైనందునే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ ఠాణా వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా చేశారు.
మంత్రి మహమూద్ అలీ మనవడు పుర్ఖాన్ కూడా నిందితుల్లో ఉన్నాడంటూ ప్రచారం అవగా, తనకు సంబంధం లేదంటూ పుర్ఖాన్ ఖండించారు. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని అమ్నీషియా పబ్ లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు ఒక బృందం నాన్ లిక్కర్ ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లు. వారిలో ఒక బాలిక పబ్ లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు(16), మిగిలిన స్నేహితులతో కలిసి కిందకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ చైర్మన్ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు.