YS Sharmila: ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల బాగు కోసం వారి శ్రేయస్సు కోసం పనిచేయాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదనీ, తెలంగాణ ప్రజలు ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీ అంటే ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలనీ, రాజకీయాలు మాత్రమే చేస్తే ప్రజలు కాదు పార్టీలు మాత్రమే బాగుపడతాయని వ్యాఖ్యానించారు.
Telangana Assembly Elections 2023: ప్రధాని నరేంద్ర మోడీని లాగుతూ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని ఆరోపించారు. ప్రాజెక్ట్ లో బ్యారేజ్ లు, పంప్ హౌస్ లు, మోటార్లు, కెనాల్ వర్క్ ఇలా ఎన్నో అనవసరమైనవి చూపించి లక్ష 20వేల కోట్లకు పెంచారన్నారు. అయితే, వైయస్ఆర్ రూ.38 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు ద్వారా 16లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకుంటే, కేసీఆర్ రీ డిజైనింగ్ పేరుతో లక్ష20వేల కోట్లకు పెంచి 18లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారని పేర్కొన్నాయి. కానీ, 18లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా అంటే అది లేదన్నారు. మంత్రి హరీష్ రావు లాంటి వారే ఒకసారి లక్ష ఎకరాలకు నీళ్లు అని మరోసారి లక్ష50వేల ఎకరాలకు ఇచ్చామని అసెంబ్లీలో చెప్పారన్నారు.
"మిమ్మల్ని అడిగే వారు లేరని ఏది పడితే అది మాట్లాడుతున్నారా..? కేవలం లక్షన్నర ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసం లక్ష20 వేల కోట్లు ఖర్చు చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోడీని కూడా ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు. దేశానికి సంబంధించిన ఇంత డబ్బు వృధా చేస్తుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. "అవినీతి జరుగుతుంటే మీరు ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా..? సాక్ష్యాత్తు బీజేపీ మంత్రులే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవడంలేదు? ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే బీజేపీకి బాధ్యత లేదా..? దీనిపై మోడీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని" షర్మిల డిమాండ్ చేశారు.
undefined
అలాగే, 80వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ రీ డిజైనింగ్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కథ కుక్కతోక తగిలి కూలిపోయినట్టు ఉందని లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ల ముంపు గురించి ప్రస్తావించారు. గతేడాది వరదలకు పంప్ హౌస్ లు మునిగిపోతే..ఈ ఏడాది మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందనీ, ఇంజనీరింగ్ లోనే లోపాలున్నాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ చెబుతోందన్నారు. " వైయస్ఆర్ 38 వేల కోట్లతో పూర్తిచేయాలనుకున్న ప్రాజెక్టును లక్ష20వేల కోట్లకు పెంచి కమీషన్లు తిన్నారు కేసీఆర్. దేశానికి సంబంధించిన డబ్బు వృథా చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోంది..? మీ మంత్రులే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని చెబుతున్నారు కదా..? అని మరోసారి ఎత్తిచూపారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం బహిరంగాగానే మద్దతిస్తుంటే బీజేపీ పార్టీ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుందని సంచలన ఆరోపణలు చేశారు.
అందుకే ప్రాజెక్టులు కూలిపోతున్నా కేసీఆర్ మీద ఏ యాక్షన్ లేదనీ, ఈడీని మోడీ, ఐటీని అమిత్ షా చేతుల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా రైడ్ లు చేస్తున్నారని విమర్శించారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల బాగు కోసం వారి శ్రేయస్సు కోసం పనిచేయాలని హితవు పలికారు. తమకు పదవులు ముఖ్యం కాదనీ, తెలంగాణ ప్రజలు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజల కోసం వైయస్ఆర్ సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద కూడా పోరాటం చేశారనీ, ఇది అందరు గ్రహించాలన్నారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామన్న సోయి అన్ని పార్టీలకు ఉండాలనీ, రాజకీయ పార్టీ అంటే ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలని పేర్కొన్నారు. కేవలం రాజకీయాలే చేస్తే పార్టీలు మాత్రమే బాగుపడతాయనీ, ప్రజలు కాదని వైఎస్ షర్మిల అన్నారు.