ముగిసిన కేసీఆర్, జగన్‌ల భేటీ: అమరావతి, దేశ రాజకీయాలపై చర్చ

By Siva KodatiFirst Published Jan 13, 2020, 8:36 PM IST
Highlights

ప్రగతి భవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల సుధీర్ఘ చర్చ అనంతరం విభజన అంశాలు, 9,10 షెడ్యూల్స్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. 

ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగానే సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.  ప్రగతి భవన్‌‌లో దాదాపు ఆరు గంటల పాటు సాగిన సుధీర్ఘ చర్చ ముగిసింది.

కృష్ణా నదిలో నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 వ షెడ్యూల్ లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

Also Read:జగన్‌కు హిమాన్ష్ కరచాలనం, కేసీఆర్ కాళ్లుమొక్కిన విజయసాయి

మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు వచ్చిన జగన్‌ బృందానికి సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు భోజనం చేశారు. దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. పూర్తి సహృద్భావ వాతావరణంలో, పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమావేశం జరిగింది.

పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ‘‘కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకే రకంగా ఉండడం లేదు. చాలా సందర్భాల్లో కృష్ణా నది ద్వారా నీరు రావడం లేదు.

దీంతో కృష్ణా నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందడం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య.

దీనివల్ల అటు రాయలసీమ, ఇటు పాలమూరు, నల్గొండ వ్యవసాయ భూములకు ఖచ్చితంగా నీరు అందుతుంది. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి.

Also Read:ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో జగన్ భేటీ: రెండు రాష్ట్రాల అంశాలపై చర్చ

దీని వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు’’ అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణయం కుదిరింది. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత విపులంగా చర్చించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. 

‘‘విభజన చట్టంలోని 9, 10 వ షెడ్యూల్లోని పలు అంశాలపై అనవసర పంచాయతీ ఉంది. దీన్ని త్వరంగా పరిష్కరించుకోవాలి. పరస్పర సహకారం, అవగాహనతో వ్యవహరిస్తే దీన్ని పరిష్కరించడం పెద్ద కష్టం ఏదీ కాదు’’ అని ఇద్దరు సిఎంలు అభిప్రాయపడ్డారు. జగన్ వెంట ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. జగన్ కు స్వాగతం పలికిన వారిలో మంత్రి కెటి రామారావు, ఎంపి జె.సంతోష్ కుమార్ ఉన్నారు.

click me!