వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని.. రూ. 200 గూగుల్‌ పే చేసి, పిలిపించి హత్య !!

By SumaBala Bukka  |  First Published Oct 14, 2022, 9:39 AM IST

తమ ఇంటి అమ్మాయి వేరే కులం వాడిని ప్రేమించిందని.. అతడిని మాయమాటలతో నమ్మించి.. ఇంటికి పిలిపించి.. దారుణంగా హతమార్చారు కుటుంబసభ్యులు. 


హైదరాబాద్ : యువతితో ప్రేమ వ్యవహారం ఆ యువకుడి ప్రాణాలు తీసింది. తమ అమ్మాయితో ప్రేమాయణం నడపడాన్ని సహించలేకపోయిన ఆమె తరపు వారు అతనికి ఫోన్ చేసి.. మాయమాటలు చెప్పి.. ఛార్జీలకు డబ్బులు గూగుల్ పే చేసి మరీ తమ వద్దకు రప్పించుకున్నారు. ఆ తర్వాత హత్య చేశారు.  హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో ఈ ఘోరం జరిగింది. ఈ మేరకు ఆరు రోజుల నుంచి కనిపించకుండా పోయిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన శివకుమార్ కథ విషాదాంతమైంది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరుకు చెందిన  బాలస్వామి ఉపాధి కోసం కుటుంబంతో కలిసి పటాన్చెరులో ఉంటున్నాడు. ఆయన కుమారుడు శివ కుమార్ కూలీ పనికి వెళ్తుంటాడు. 

ఈ క్రమంలో శివకుమార్ కు ముషీరాబాద్ కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. అలా తరచూ శివకుమార్ ముషీరాబాద్ కు వెళ్లి ఆమెను కలిసేవాడు. ఇది యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో.. శివకుమార్ ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 7న మధ్యాహ్నం పథకం ప్రకారం యువతితో శివకుమార్ కు ఫోన్ చేయించారు. ఆమె శివ కుమార్ ను ముషీరాబాద్ కు రావాలని పదేపదే కోరింది. యువతి కుటుంబ సభ్యులు కూడా అదే ఫోన్ ద్వారా శివకుమార్ తో మాట్లాడారు. ఒకసారి వచ్చి.. మాట్లాడి వెళ్లాల్సిందిగా నమ్మబలికారు. తన వద్ద డబ్బులు లేవని అతడు చెప్పగా.. యువతి ఫోన్ నుంచి 200 రూపాయలు గూగుల్ పే చేశారు.

Latest Videos

‘స్వప్పా క్షమించు..’ సెల్ఫీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే..

శివకుమార్ అదే రోజు సాయంత్రం ముషీరాబాద్ కు వెళ్ళాడు. ఆ తర్వాత రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లి శివకుమార్ కి ఫోన్ చేసింది. ఆ ఫోన్ ఎత్తి ముషీరాబాద్ లో ఉన్న యువతి వద్దకు వచ్చాను అని.. అతడు చెబుతుండగానే.. ఇంకొందరు శివకుమార్ సెల్ఫోన్లు బలవంతంగా లాక్కుని.. స్విచ్ ఆఫ్ చేశారు. ఆ తర్వాత శివకుమార్ ఫోన్ కలవలేదు. అంతను ఇంటికి రాలేదు. దీంతో మరుసటి రోజు శివకుమార్ తల్లిదండ్రులు యువతి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. 

తమ కొడుకు ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడ్డారు. అయితే, వారు మాత్రం అతను తమ వద్దకు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోక యువకుడి తల్లిదండ్రులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబ సభ్యులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా శివ కుమార్ హత్యకు గురైనట్లుగా తెలిసింది. యువతీ యువకులు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో అదృశ్యమైన రోజే శివకుమార్ ను దారుణంగా హత్య చేసి ముషీరాబాద్ పరిసరాల్లోని నాలాలో పడేసినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. శివకుమార్ మృతదేహం కోసం గాలిస్తున్నామని సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 
 

click me!