హమ్మయ్య సేఫ్ జోన్ లోనే మెంటల్ హాస్పటల్

First Published Jun 19, 2017, 1:15 PM IST
Highlights

తెలంగాణ ఏర్పాటైన వెంటనే తెలంగాణ సర్కారు కన్ను మెంటల్ హాస్పటల్ మీద పడ్డది. ఆ దావాఖానాను ఎర్రగడ్డ నుంచి తరలిస్తామని ప్రకటించింది. దానితోపాటు దాని పక్కనే ఉన్న చెస్ట్ ఆసుపత్రి కూడా అక్కడి నుంచి కదిలిస్తామన్నది. కానీ ఇప్పుడు సర్కారు ఆ రెండు దావాఖానాలపై కరుణ చూపుతోంది.

హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న సచివాలయాన్ని తరలించేందుకు తెలంగాణ సర్కారు నానా హైరానా పడింది. భయంకరమైన వాస్తుదోషం కారణంగా సచివాలయాన్ని అక్కడినుంచి లేపేస్తామని ప్రకటించింది. సచివాలయం తరలిస్తే తరలించారు కానీ ఎక్కడికి తరలిస్తారన్నదానిపై సర్కారుకు క్లారిటీ లేకుండా పోయింది. ముందుగా ఎర్రగడ్డకు అన్నారు. అక్కడ ఉన్న చెస్ట్, మెంటల్ ఆసుపత్రులను వికారాబాద్ అడవులకు తరలిస్తామన్నారు. తర్వాత అక్కడ కాదులే అని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సచివాలయం కడతామన్నారు. దానికోసం ప్రయత్నాలు చేశారు. కేంద్రంపై వత్తిడి తెచ్చారు. ఇప్పుడు అది కూడా కాదని చెప్తున్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానం పక్కనే ఉన్న బైసన్ పోలో మైదానంలో కొత్త సచివాలయం కట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు తెలంగాణ పాలకులు.

 

తెలంగాణ సర్కారు ఏనాడూ మాటమీద నిలబడలేదన్న అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. మూడేళ్లుగా సచివాలయాన్ని రోజుకోసారి తరలిస్తున్నట్లు చెబుతున్నందున ఉరుము ఉరిమి మంగళం మీద పడుతుందేమో అని జనాలు భయపడుతున్న సందర్భాలున్నాయి. తాజా పరిణామాలు చేస్తే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో రూ.18 కోట్లతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవన నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సోమవారం శంకు స్థాపన చేశారు.

 

మొత్తానికి తాజా పరిస్థితి ప్రకారం ఎర్రగడ్డ దావాఖానా సేఫ్ జోన్ లోనే ఉందని ఊపిరి పీల్చుకుంటున్నారు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది.

click me!