ఆ విషయంలో కెసిఆర్ ప్లాన్ రివర్స్ అయింది.

First Published Jun 19, 2017, 8:33 AM IST
Highlights

రాజకీయ వ్యూహాల్లో తెలంగాణ సిఎం కెసిఆర్ ను మించిన వారు లేరు. ఆయన స్కెచ్ వేస్తే ప్రత్యర్థులు పరేషాన్ కావాల్సిందే. కెసిఆర్ ప్లాన్ చేస్తే వంద శాతం సక్కెస్ కావాల్సిందే. కానీ ఆ విషయంలో ఆయన ప్లాన్ ఫెయిల్ అయింది. సీన్ రివర్స్ అయింది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి.

తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సర్కారు నీళ్లొదిలింది. హైదరాబాద్ లో ధర్నా చౌక్ లేకుండా చేసింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బాధితులకు ధర్నా చౌక్ లేని బాధ తీరిపోతున్నది. ఇందిరాపార్కు వద్ద ఉన్న  ధర్నా చౌక్ ను తెలంగాణ సర్కారు ఎత్తేసింది. దీంతో రాష్ట్రమంతా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పౌరుల  ప్రాథమిక హక్కును హరిస్తున్నారంటూ మండిపడ్డాయి విపక్షాలు. రాష్ట్రంలో ఆందోళనపై సర్కారు ఎంతగా ఉక్కుపాదం మోపుతుందో అంతకు రెట్టింపు స్థాయిలో ఆందోళనలు సైతం పెరుగుతూనే ఉన్నాయి. ధర్నాచౌక్ లేకుండా చేయడం కోసం సర్కారు ప్రయత్నాలు చేస్తుంటే బాధితులు సిఎం ఇష్టపడి కట్టుకున్న ప్రగతి భవన్ ముందే ధర్నాలు చేస్తూ షాక్ ఇస్తున్నారు. నిన్న కాక మొన్న నర్సులు సిఎం ఇంటిని ముట్టడిస్తే ఇప్పుడు 98 డిఎస్సీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో కెసిఆర్ ప్లాన్ అట్టర్ ఫ్లాఫ్ అయింది.

 

తెలంగాణ సర్కారు అధికారంలోకి రాగానే సిఎం కెసిఆర్ ఉపాధ్యాయ భర్తీపై  పలుమార్లు సమీక్షలు జరిపారు. ఆ సందర్భంగా  98 డిఎస్సీ, 2012 డిఎస్సీ అంటూ ఇంకా ఏండ్ల  తరబడి వారిని పెండింగ్ లో ఉంచడమేంది? అందరినీ వీలైనంత వరకు మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. దీంతో  98 డిఎస్సీ వారు, తర్వాత 2008 వారు, 2012 అభ్యర్థులు పోటీపడి సిఎం కెసిఆర్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. సిఎం హామీలిచ్చి ఏండ్లు గడుస్తున్నా తమకు ఉద్యోగాలు రాకపోవడంతో వారిలో నైరాశ్యం నెలకొంది. ఇంకెప్పుడు ఉద్యోగాలొస్తాయని వారు తెలిసిన అధికారి చుట్టూ, మంత్రుల చుట్టు, చోటా మోటా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా వారి సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైంది. సిఎం కెసిఆర్ తియ్యటి మాటలతో తమను మోసం చేశాడని బాధితులు గుర్తించారు. దీంతో ఆందోళన బాట పట్టారు.

 

హైదరాబాద్ లో నిన్నమొన్నటి వరకు ఆందోళనలు అన్నీ ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ వద్దే జరిగేవి. కానీ ధర్నాచౌక్ మాయం కావడంతో 98 డిఎస్సీ అభ్యర్థులు సిఎం ఇంటినే ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఆదివారం అయినప్పటికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్ ను ముట్టడించేదుకు దశలవారీగా వచ్చారు. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు.

 

 వారం రోజుల క్రితమే నర్సులు తమ రెగ్యులరైజేష్ విషయంలో సిఎం నివాసం ప్రగతిభవన్ ను ముట్టడించి ధర్నా చేశారు. తమను ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ప్రశ్నించారు. దీంతో అక్కడి పోలీసులు నర్సులందరినీ అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వీరే కాకుండా ఓ రైతు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుందామని ప్రగతిభవన్ వస్తే ఆయనను లోపలికి అనుమతించలేదు.  దీంతో ప్రగతిభవన్ ముందే ఆయన ఆత్మహత్యాయత్నం చేశారు.

 

మొత్తానికి రాజకీయ చాణిఖ్యుడిగా పేరొందిన సిఎం కెసిఆర్ వ్యూహాలలో కొన్ని ఇలా రివర్స్ అవుతున్నాయి. ఇందిరాపార్కు వద్ద వద్దంటే ప్రగతి భవన్ నే ధర్నా చౌక్ గా మార్చడంతో టిఆర్ఎస్ ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.

click me!