చేదువార్తను తియ్యగా చెబుతున్న తెలంగాణ సర్కారు

First Published Jun 19, 2017, 12:06 PM IST
Highlights

అభం శుభం తెలియని నిరుపేద చిన్నారులకు ఇది చేదువార్త. వారికే కాదు చదువు సంధ్య లేని గ్రామీణ పేదలకు, గిరిజనాలకు కూడా ఇది అసలైన చేదువార్తే. కానీ ఆ చేదువార్తను వారికి అత్యంత తియ్యగా చెబుతున్నది తెలంగాణ సర్కారు. నొప్పి తెలియకుండా దెబ్బకొడుతున్న తీరులో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా పిల్లల సంఖ్య తక్కువగా ఉందని 4వేల పాఠశాలలు మూసిపారేస్తోంది ప్రభుత్వం. దీంతో గిరిజన గూడేంలలో, మారుమూల పల్లెటూర్లలో రానున్న రోజుల్లో పాఠశాల అనేది కనిపిస్తే ఒట్టు. మరి ఏకమొత్తంగా 4వేల పాఠశాలలు ఒకేఒక్క కలం పోటుతో మూసివేయడం పట్ల ఒకవైపు  ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.

 

దీనికి సర్కారు చెబుతున్న లెక్కలు వేరే ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం చేయని రీతిలో నియోజకవర్గానికి ఒక గురుకుల విద్యాలయం ఓపెన్ చేశాము. బిసిలకు బిసి రెసిడెన్సియల్ గురకులం, మైనార్టీలకు మైనార్టీ గురుకులం, ఎస్సీలకు ఎస్సీ గురుకులం, ఎస్టీలకు ఎస్టీ  గురుకులం ఏర్పాటు చేశాం. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏర్పాటు చేసిన గురుకులాల కంటే మేమే ఎక్కువ గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని  సర్కారు పెద్దలు చెబుతున్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ సందర్భంలోనూ 4వేల పాఠశాలలు మూసే ధైర్యం చేయలేదు నాటి పాలకులు. ఆ విషయాన్ని మాత్రం తెలంగాణ సర్కారు  చెప్పడంలేదు.

ఇక పాఠశాలల మూసివేత చేదు గులికకు తేనె పూసి చెబుతోంది సర్కారు. మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి స్కూలుకు వచ్చే విద్యార్థులకు రవాణ ఖర్చుల కోసం నెలకు రూ.300 చొప్పున చెల్లించనుంది. ఇది ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదివే స్టూడెంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇందుకోసం రూ.5.28 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. విద్యార్ధులకు మరింత మెరుగైన విద్యను అందించేందుకు, డ్రాపవుట్ ను తగ్గించే చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. వినడానికి ఈ మాటలు ఎంత సొంపుగా ఉన్నప్పటికీ మీ ఊర్లో ఉన్న బడి మూసిపారేసి మీ పిల్లలకు రోజుకు పది రూపాయల చొప్పున నెలకు 300 ఆటో కిరాయిలిస్తాం. మీరు పక్క ఊర్లలో మీ పిల్లలను చదివించుకోరి అని చావు కబురు చల్లగా చెబుతోంది.

 

మరి మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటేనే ఇస్తారంటున్నరు. మూడు కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటే వారి పిల్లలు బడికి ఎలా  వెళ్లాలి.

 

8వ తరగతి వరకే ఇస్తామంటున్నారు. అంటే 9, 10 తరగతులు చదివే పిల్లలకు ఇవ్వకపోతే వారు ఎలా బడికి వెళ్లాలి.

 

మరీ విచిత్రంగా డ్రాపౌట్స్ తగ్గేందుకు ఈ 300 ఇవ్వడం ఏమైనా పనిచేస్తుందా?

 

ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి కానీ ఇలా ఆటో కిరాయిలతో, నియోజకవర్గానికి ఒక్క రెసిడెన్సియల్ బడితో ప్రతి విద్యార్థికి చదువు చెప్పడం సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

 

click me!