మద్యం మత్తులో చిత్రహింసలు.. తట్టుకోలేక భార్య ఆత్మహత్య, షాక్ అయి పురుగుల మందు తాగి భర్త మృతి...

By SumaBala Bukka  |  First Published Jun 8, 2023, 7:57 AM IST

మద్యానికి బానిసై భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. అది చూసి భర్త పురుగులమందు తాగి చనిపోయిన ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మద్యం మహమ్మారి పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతోంది. తాగుడుకు అలవాటు పడి కాపురాల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఎంతో మంది వల్ల.. కుటుంబాలు రోడ్డున పడుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తాయి. అలా మద్యం ఓ పచ్చని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 24 గంటల్లో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైంది. లోకం తెలియని అమాయక చిన్నారులను అనాధలుగా మార్చింది.

భార్య భర్తల ఆత్మహత్య ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం జానకిపురం గ్రామానికి చెందిన కోలా అఖిల (21), వెంకటేశ్వరరావు (28) భార్యాభర్తలు. వీరిది నిరుపేద కుటుంబం. వీరికి మూడేళ్లు, సంవత్సరం వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య వ్యవసాయ కూలీగా పని చేస్తుండగా భర్త లారీ డ్రైవర్ గా పనిచేస్తూ గుట్టుగా సంసారాన్ని సాధిస్తున్నారు.

Latest Videos

పల్నాడులో దారుణం : భార్యను గొంతు నులిమి చంపి.. భర్త ఆత్మహత్యాయత్నం..

కొంతకాలంగా భర్త వెంకటేశ్వరరావు మద్యానికి బానిస అయ్యాడు. దీంతో పచ్చని కాపురంలో చిచ్చు మొదలైంది. భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు భరించలేక అఖిల తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య  చేసుకుంది. ఇది చూసిన భర్త వెంకటేశ్వరరావు తట్టుకోలేకపోయాడు అదే రోజు పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంకటేశ్వర రావును కొత్త కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ తన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.  ఒకరోజు తేడాతో తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నారులైన నరేంద్రబాబు, అక్షిత్ కుమార్ లు అనాధలుగా మారారు. లోకం తెలియని ఆ అమాయక చిన్నారులు తండ్రి మృతదేహాన్ని దీనంగా చూస్తుండడం గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది.

click me!