రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోకల సాయికుమార్ అనే విద్యార్ధిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ అక్రమ అరెస్టును ప్రజాస్వామిక వాదులు, మేధావులు అందరూ ఖండించాలని పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోకల సాయికుమార్ అనే విద్యార్ధిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. పోలీసుల చర్యను నిరసిస్తూ బుధవారం పీడీఎస్‌యూ పూర్వ విద్యార్ధుల రాష్ట్ర కమిటీ సిరిసిల్ల ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులలో స్వేచ్చ, వాక్ స్వాతంత్ర్యం ప్రతి వ్యక్తికి ముఖ్యమని.. అలాంటి వాక్ స్వాతంత్య్రం మీద పోలీస్ వ్యవస్థ దాడి చేయడం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమంలో ఒక విద్యార్థిగా తన వంతు పాత్ర నిర్వహించిన సాయి కుమార్( ప్రస్తుతం LLB విద్యార్థి), ప్రగతి శీల విద్యార్ధి ఉద్యమంలో కొనసాగాడని వారు తెలిపారు. పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థిగా ఉంటూ విద్యార్థి, నిరుద్యోగ సమస్యల మీద నిత్యం తన గళం వినిపిస్తూ... వారి పక్షం నిలుస్తున్నాడని వారు ప్రశంసించారు. అలాంటి సాయి కుమార్ మీద బైండోవర్ చేసి పోలీసులు ఇబ్బందులు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి.. భోజనం చేసేందుకు హోటల్‌కు వెళ్తుండగా కింగ్స్ హోటల్ (రగుడు స్టేజి) వద్ద వేములవాడ ఎస్ఐ రఫీ ఖాన్తో పాటు ఇద్దరు మఫ్టీలో వచ్చి సాయి కుమార్‌నీ ఎత్తుకెళ్లారని వారు తెలిపారు. రాజ్యంగబద్దంగా సాయికుమార్ ఒక విద్యార్థిగా విద్యార్థుల పక్షం ఉంటే తప్పుడు ఆరోపణలతో పోలీసులు కుట్ర చేస్తున్నారని నేతలు ఆరోపించారు. ఈ విషయంలో హోంమంత్రి , డీజీపీ జోక్యం చేసుకొని సాయి కుమార్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టును ప్రజాస్వామిక వాదులు, మేధావులు అందరూ ఖండించాలని పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.