
టిఆర్ఎస్ లో ఇంతకాలం నెంబర్ 2గా చెలామణి అయిన కె.కేశవరావుకు పొగ పెడుతున్నారా..? ఆయనను పార్టీలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా..? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. కేశవరావును టిఆర్ఎస్ లోని కొందరు పెద్దలు టార్గెట్ చేశారన్న చర్చ సాగుతోంది.
బిజెపి నుంచి వచ్చిన టైగర్ నరేంద్ర హవా టిఆర్ఎస్ లో కొంతకాలమే సాగింది. యుపిఎలో కేంద్ర మంత్రివర్గంలో ఆయయనకు అవకాశం కల్పించారు కెసిఆర్. అనంతర కాలంలో కెసిఆర్ తో ఆయనకు పొసగలేదు. దీంతో నరేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కెసిఆర్. నరేంద్ర తర్వాత నెంబర్ 2 స్థానంలోకి సినీ నటి విజయశాంతి చేరారు. ఆమె హవా కొంత కాలం సాగింది. తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న కాలంలో టిఆర్ఎస్ కు ఉన్న ఇద్దరు ఎంపిల్లో కెసిఆర్ తోపాటు ఆమె కూడా ఉన్నారు. ఒక దశలో ఆమెను తన సోదరిగా అభివర్ణించారు కెసిఆర్. కానీ... అనూహ్యంగా ఆమె కూడా టిఆర్ఎస్ నుంచి ఉధ్వాసనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు నెంబర్ 2 స్థానాన్ని కె.కె. దక్కించుకున్నారు. ఆయనకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవితోపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీలో కెకె కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన గౌరవానికి ఇప్పటి వరకు భంగం రానీయలేదు. కానీ.. తాజాగా టిఆర్ఎస్ లో పాత రోజులు పునరావృతమవుతున్నట్లు చర్చ నడుస్తోంది. శంషాబాద్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ వద్ద కెకె కొనుగోలు చేసిన భూమి విషయంలో వివాదం నెలకొంది. దీనిపై కెకె వివరణ కూడా ఇచ్చాడు. ఈ వివాదంలో కెకె పేరును ప్రభుత్వమే లీక్ చేసిందని తెలంగాణ జెఎసి బాంబు పేల్చింది. జెఎసి ఆరోపణలతో రాజకీయ వర్గాల్లో కలవరం మొదలైంది. అంతేకాకుండా... తన వ్యవహారశైలిపై ప్రయివేటు సంభాషణల్లో కెకె వ్యతిరేకంగా మాట్లాడినట్లు సిఎం కెసిఆర్ దృష్టికి వచ్చిందట. దీంతో గత ఏడెనిమిది నెలలుగా కెకెను పక్కనపెట్టే తతంగం జరుగుతోందని పార్టీ నేతలు అంటున్నారు.
గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూముల కుంభకోణం కెకె మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే... టిఆర్ఎస్ లో ఆయన పలుకుబడి మాత్రం తగ్గడం ఖాయమంటున్నారు. తనకు అన్యాయం జరిగిందని కెకె భావిస్తే ఆయన న్యాయ పోరాటం చేయడంలో తప్పు లేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సంకేతాలివ్వడం చూస్తే... కెకె విషయంలో ప్రభుత్వం, పార్టీ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మొత్తానికి టిఆర్ఎస్ లో డేంజర్ జోన్ లో ఉన్న నెంబర్ 2 పదవికి కెకె తర్వాత ఎవరు చేరుకుంటారో అన్న ఉత్కంఠ రేగుతున్నది టిఆర్ఎస్ పార్టీలో. డేంజర్ జోన్ నుంచి నెంబర్ 2 ఎప్పుడు సేఫ్ జోన్ గా మారుతుందా అని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మరి కెకె తర్వాత నెంబర్ 2 స్థానంలో ఎవరొస్తారబ్బా అని నేతలు చర్చించుకుంటున్నారు.