రేవంత్ రెడ్డి ఎటు పోయిండబ్బా?

First Published Aug 26, 2017, 12:58 PM IST
Highlights
  • ఫైర్ బ్రాండ్ మౌనముద్ర
  • కీలక పరిణామాలపై మూగనోము
  • రెడ్డి చర్చకు రేవంత్ దూరం
  • చర్చనీయాంశమైన రేవంత్ తీరు

తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న టిడిపి నేత రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా మౌనముద్రలో ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై తనదైన శైలిలో మాట్లాడి పంచ్ లు విసిరే రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన ఇటీవల కాలంలో ఎందుకు మీడియాకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నప్పటికీ రేవంత్ తెర మీదకు ఎందుకు రావడంలేదు? ఇంతకూ రేవంత్ ఎటుపోయిండబ్బా? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక టివి చానెల్ లో రెడ్డీ కులస్తుల మీద చర్చ, అంతకంటే ముందు జెఎసి ఛైర్మన్ కోదండరాం దొంగ రెడ్డి అంటూ ఒక మంత్రి ధూషణలు, తర్వాత రెడ్డి హాస్టల్ ప్రారంభోత్సవం, సిఎం కురిపించిన వరాల జల్లులు, పోలీసు అకాడమీ పేరు మార్పుపై సిఎం పొరపాటు కామెంట్స్... ఇలా అనేక అంశాలు చోటు చేసుకున్నా రేవంత్ మాత్రం ఏ ఒక్కదానిపైనా స్పందించలేదు. ఎందుకోసం రేవంత్ ఈ అంశాలపై స్పందించలేదన్న చర్చ జనాల్లో ఊపందుకుంది.

సిరిసిల్ల దళితుల థర్డ్ డిగ్రీ అంశంలో రేవంత్ సర్కారును కడిగిపారేశారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఇద్దరిలో ఎవరినీ వదలకుండా తిట్ల పురాణం ఎత్తుకున్నారు. ఒక దశలో అయితే సిఎం కేసిఆర్ భాషలోనే వారిని కూడా తిట్టిపోశారు రేవంత్ రెడ్డి. సిరిసిల్ల ఇష్యూ తర్వాత ఒక్కసారిగా రేవంత్ సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు రాలేదు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ అయినప్పటికీ రేవంత్ స్పందించలేదు.

రేవంత్ హైదరాబాద్ లో ఉన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కానీ తాజా పరిణామాలపై మాత్రం నోరు మెదపలేదు. అయితే దీనిపై కారణాలు అనేకం ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కులపరమైన అంశాలపై స్పందిస్తే సర్కారుకు ఆయుధం ఇచ్చినట్లు అవుతుందన్న ఉద్దేశంతోనే రేవంత్ మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. సర్కారు వ్యూహాత్మక వైఖరిని అర్థం చేసుకుని రేవంత్ ఒక అడుగు వెనక్కు వేసి సైలెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. రెడ్డీల విషయంలో ఎన్ని వివాదాలు, విమర్శలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆయన స్పందిస్తే కుల నాయకుడి ముద్ర వేస్తారన్న కారణంగానే రేవంత్ దూరంగా ఉండొచ్చని ఒక టిడిపి నేత పేర్కొన్నారు.

గతంలో హోంమంత్రి నాయిని పై ఒంటికాలుపై లేచారు రేవంత్. హోంగార్డును కూడా బదిలీ చేయించలేని మంత్రి నాయిని అంటూ ఘాటు కామెంట్లు చేశారు. మరి అదే మంత్రి జెఎసి చైర్మన్ కోదండరాం పై దొంగ రెడ్డి అని కామెంట్ చేసినా రేవంత్ స్పందించకపోవడం, రాజాబహుదూర్ వెంటక రామారెడ్డి పేరును అప్పా కు పెట్టినట్లు సిఎం మాట్లాడినా రేవంత్ స్పందించకపోవడం మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మరి రేవంత్ ఎప్పుడు మౌనం వీడతారో చూడాలి.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

click me!