తెలంగాణలో పోలింగ్ ప్రారంభమయ్యింది. బుదవారం అంతా ప్రలోభాల పర్వాలు కొనసాగాయి. తెలంగాణ ఓటరు మార్పు కోరుకుంటున్నారా? కొనసాగింపునే ఇష్టపడుతున్నారా? నేడు తేలనుంది. ఇలాంటి వార్తా కథనాల సమాహారం.. టాప్ టెన్ స్టోరీస్ ఇవి...
చివరి రోజు ప్రలోభాల పర్వం…
హైదరాబాద్ : తెలంగాణలో గురువారం పోలింగ్ నేపథ్యంలో బుధవారం నాడు అన్ని పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా మద్యం, డబ్బుల పంపిణీ చేశాయి. అన్ని పార్టీలు ప్రచారంతోపాటు ప్రలోభాల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించాలని ఆఖరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దీంట్లో భాగంగానే పలుచోట్ల చివరి రోజు ప్రత్యర్థి కంటే ఎక్కువ మొత్తం డబ్బులు ఇచ్చి, ఎక్కువ మంది ఓటర్లను తమకు ఓటు వేసేలా చేసుకోవాలని చూశారు. పోటీ తీవ్రంగా ఉన్నచోట మద్యానికి ఒక్కొక్కరు ఐదారు కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్టుగా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఈనాడు మెయిన్ పేజీలో ‘నువ్వేంతిస్తే.. నేనంతిస్తా..’ పేరుతో ప్రచురించింది.
నేడే పోలింగ్..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం నాడు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనాడు ‘సిరా చుక్క.. తీర్పు రాసేవేళ..’ అనే వార్తను బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరగనుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతున్నారని, 104 మంది ఎమ్మెల్యేలు, ఐదు ఎమ్మెల్సీలు పోటీలో ఉన్నారని రాసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఉన్న అసెంబ్లీ స్థానాల్లో డిఆర్ఎస్ నుంచి 119 స్థానాల్లో, కాంగ్రెస్ 118 స్థానాల్లో.. సిపిఐతో పొత్తు ఒక స్థానంలో, బిజెపి 11 స్థానాల్లో.. బిజెపితో పొత్తులో ఉన్న జనసేన 8 స్థానాల్లో, 19 నియోజకవర్గాల్లో సిపిఎం, 107 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఈనాడు ప్రచురించింది.
నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు…అందులో ఓ డిసిపి…
తెలంగాణలో ఎన్నికల్లో డబ్బు తరలింపు ఆరోపణలతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాదులో డిసిపి, ఏసిపి, మరో ఇన్స్పెక్టర్, వరంగల్ ఆప్కారి ఇన్స్పెక్టర్ల పైన సస్పెన్షన్ వేటుపడింది. మరో జైలర్ను సర్వీసు నుంచి తొలగించారు. ఈ క్రమంలో డీసీపీ స్థాయి అధికారిపై వేటుపడటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఈనాడు ప్రచురించింది.
81 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు..
కొన్ని కీలక కేబినెట్ నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి ఢిల్లీలో కేబినెట్ నిర్ణయాలపై భేటీ జరిగింది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీంట్లో ప్రముఖంగా..వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం, ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసి న్యాయమహా అభియాన్ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. ఐదేళ్లపాటు 81.35 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు.. ప్రచురించింది.
ప్రభుత్వం చేసిన ఘనతలను ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేముంది?..ఏపీ హైకోర్టు
ఆంధ్ర ప్రదేశ్ లో ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు పాల్గొనకుండా చూడాలని, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా మద్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీని మీద బుధవారం నాడు హైకోర్టు విచారించింది. మద్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ప్రభుత్వం చేసిన ఘనతలను ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేం ఉందని పిటీషనర్ను ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వివరించడంలో తప్పేమీ లేదని ఏ ప్రభుత్వమైన ఇదే చేస్తుందని చెప్పుకువచ్చింది. దీనికి సంబంధించిన సమగ్ర కథనాన్ని సాక్షి ‘ప్రభుత్వం ఘనతలను చెప్పుకోవడంలో తప్పేముంది?’ అనే పేరుతో బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.
ఒక్క ఫోన్ కాల్ దూరంలో..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం, స్థానిక యువతకు ఉపాధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. దీనికోసమే జిఐఎస్ ఒప్పందాలను వేగంగా అమల్లోకి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. గ్లోబల్ సమీట్లో ఒప్పందాల మేరకు ఇప్పటికే 33 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించినట్లుగా చెప్పుకొచ్చారు. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివిధ దశల్లో మిగతావి ఉన్నాయని, వీటి మీద పురోగతి సాధించేలా నిరంతరం సిఎస్ సమీక్షలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమస్యలు పరిష్కరిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని సాక్షి బ్యానర్ ఐటమ్ గా ‘ఒక్కఫోన్ కాల్ చాలు’ అన్న పేరుతో ప్రచురించింది.
అవుకు రెండో టన్నెల్ జాతికి అంకితం చేయనున్న జగన్..
ఆంధ్రప్రదేశ్లో గాలేరు-నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన వార్తను ప్రముఖంగా సాక్షి ‘జలసిరుల సీమ’ పేరుతో వార్తా కథనాన్ని ప్రచురించింది. రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో సాగునీటినీ వారించి సుభిక్షం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అవుకు రెండో సారంగం ఫాల్ట్ జోన్ అంతర్భాగం. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు-నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.
మార్పా?.. కొనసాగింపా?...
ఓటుకు వేళాయె అంటూ ఆంధ్ర జ్యోతి ఓ ప్రత్యేక కథనాన్ని బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది. తెలంగాణలో ఈసారి మార్పు వస్తుందా? కొనసాగింపే ఉంటుందా? ఓటర్లు నేడు నిర్ణయించనున్నారంటూ వార్త కథనాన్ని ప్రచురించింది. ఓటు వేసేందుకు సొంతూర్లకు వచ్చే వారికి ఖర్చులు ఇస్తామంటూ ఆయా పార్టీల అభ్యర్థులు, నేతలు ఫోన్లు చేస్తున్నారని ఇందులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాదు నుంచి లక్షల సంఖ్యలో సొంతూర్లకు ప్రయాణం అయ్యారని తెలిపింది. పోలింగ్ కోసం జిల్లాలకు ఆర్టీసీ 700 ప్రత్యేక బస్సులు నడిపినట్టుగా చెప్పుకొచ్చింది. ఓటు వేయడం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాదుకు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లుగా ఈ వార్తా కథనంలో తెలిపింది.
చట్టబద్ధత కల్పిస్తాం..
6 గ్యారంటీలకు చట్టబద్ధత అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కెసిఆర్ పాలనపై ప్రజలు విరక్తి చెంది ఉన్నారని మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈరోజు జరిగే పోలింగ్లో కాంగ్రెస్ 72 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గ సమావేశంలోని 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి ‘6 గ్యారంటీలకు చట్టబద్ధత’ పేరుతో ప్రచురించింది.
telangana elections 2023 : బిర్లా టెంపుల్, నాంపల్లి దర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రత్యేకపూజలు...
ఒక్క ఓటుకు రూ. 20వేలు..
పోలింగ్ ముందు రోజు అన్ని నియోజకవర్గాల్లో డబ్బు కట్టలు తెగింది. మద్యం ఏరులై పారింది. కొడంగల్ నియోజకవర్గంలోలో కొన్ని చోట్ల ఒక ప్రధాన పార్టీ ఓటుకు రూ. 20,000 ఇచ్చారు. ఈ డబ్బుతో పాటు కిలో మటన్, క్వార్టర్ మద్యం పంచారని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని మెయిన్ పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఇక పెద్దపల్లిలో డబ్బుతో పాటు మద్యం, బోనస్ గా చీరలు పంచిపెట్టినట్లుగా తెలిపింది. గద్వాలలో డబ్బుతో పాటు కిలో చికెన్, పుల్లారెడ్డి స్వీట్లు పంచారు. బూతు స్థాయి ఓటర్ల వివరాల ఆధారంగా ఈ పంపిణీలు జరిగినట్లుగా సమాచారం. దీంట్లో కూడా సంపన్న పార్టీ ఎక్కువ మొత్తంలో పంపిణీ చేసిందని, దాన్ని తట్టుకోవడానికి మరో పార్టీ కూడా ఏమాత్రం తీసుకోకుండా సర్దుబాటు చేసిందని… వార్తా కథనాన్ని రాసుకొచ్చింది.