హైద్రాబాద్‌కు బీజేపీ అగ్రనేతల రాక: ఈ నెల 2,3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు

By narsimha lodeFirst Published Jul 1, 2022, 12:03 PM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు హైద్రాబాద్ కు క్యూ కట్టారు. పలువురు అగ్రనేతలు రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 


హైదరాబాద్: BJP  జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలు Hyderabad కు క్యూ కట్టారు.  శుక్రవారం నాడు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP Nadda  హైద్రాబాద్ కు రానున్నారు. జేపీ నడ్డాను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి బీజేపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీగా తీసుకురానున్నారు. ఈ నెల 2న ప్రధానమంత్రి Narendra Modi హైద్రాబాద్ వస్తారు.

బీజేపీ National Executive Meeting నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 350 మంది ప్రతినిధులు హైద్రాబాద్ కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బీజేపీ తెలంగాణ శాఖ ఏర్పాట్లు చేసింది. బీజేపీ  జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేపట్టేందుకు కమలదళం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలోని పలువురు పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లలో బస చేయనున్నారు.ఒక్కొక్క నియోజకవర్గానికి చెందిన ఒక్కో నేత వెళ్లారు. 

 హైదరాబాద్‌ మల్లాపూర్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తలు సమావేశానికి ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌ హాజరయ్యారు.  నిజామాబాద్‌ జిల్లా డిచ్ పల్లి, జక్రాన్ పల్లిలో కేంద్రమంత్రి ఫగన్ సింగ్ కులస్తే పర్యటించారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వ్యాఖ్యానించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని పదాధికారులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వెళ్లిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌  మాజీ సీఎం ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.

తెలంగాణ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాలకు కమలనాథులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నగరంలో బీజేపీ జెండాలు, ఫ్లెక్సీల, కటౌట్లు, బోర్డులతో నింపేశారు.  
దాదాపు 18 ఏళ్ల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికవుతోంది.  రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ నెల 3న జాతీయ కార్యవర్గసమావేశాల ముగింపును పురస్కరించుకొని  సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కనీసం 10 లక్షల మందిని తరలించాలని కూడా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేరుగా హైటెక్స్‌కు చేరుకుంటారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో భేటీ అవుతారు. కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ముసాయిదా రూపొందించనున్నారు.

రేపు, ఎల్లుండి జరిగే వివిధ సమావేశ ప్రాంతాలకు పేర్లను ఖరారు చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోడీ సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హెచ్.ఐ.సీ.సీ నోవాటెల్ ప్రాంతానికి శాతవాహన నగరంగా పేరు పెట్టారు. 

మీటింగ్ ప్లేస్‌కు కాకతీయ ప్రాంగణం, భోజనశాలకు భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంగా నిర్ణయించారు. మీడియా హాల్‌కి షోయబుల్లా ఖాన్, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క-సారలమ్మ నిలయంగా నామకరణం చేశారు. ప్రధాన కార్యదర్శుల సమావేశ మందిరానికి వందేమాతరం రామచంద్రరావు పేరు, కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసుగా పేరు పెట్టారు. బీజేపీ సంఘటన కార్యదర్శుల సమావేశ మందిరానికి కొమురం భీం, ఎగ్జిబిషన్‌కి గొల్లకొండ, తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టారు.
 

click me!