Hyderabad Crime : తొమ్మిదో తరగతి మైనర్ల ప్రేమాయణం... చెరువులో దూకి బాలిక ఆత్మహత్య, బాలుడు మిస్సింగ్

By Arun Kumar PFirst Published Jul 1, 2022, 11:02 AM IST
Highlights

తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్లు తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దుర్ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : తెలిసీతెలియని వయసులో కలిగే ఆకర్షణను వారిద్దరూ ప్రేమగా భావించారు. విషయం తెలిసి తొమ్మిదో తరగతిలో ప్రేమాయణం ఏంటని తల్లిదండ్రులు మందలించారు. ఇలా తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని మైనర్ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బాలిక మృతిచెందగా బాలుడి ఆఛూకీ లభించడంలేదు. ఈ విషాద ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ కుత్భుల్లాపూర్ పరిధిలోని అయోధ్యనగర్ లో దర్గయ్య, లలిత దంపతులు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. వీరి మైనర్ కూతురు దగ్గర్లోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శివ, ఇందిర దంపతుల కుమారుడు కూడా అదే పాఠశాలలో బాలికతో కలిసి 9వ తరగతి చదువుతున్నాడు. ఒకే తరగతి కావడంతో వీరిద్దరూ స్నేహంగా వుండేవారు. ఈ స్నేహం మరింత బలపడి ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. తెలిసీతెలియని వయసులో కలిగిన ఈ ఆకర్షణనే ప్రేమగా బావించారు. 

కొంతకాలం ఈ మైనర్ల ప్రేమ సాఫీగానే సాగినా ఎలాగో ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలిసిందే. దీంతో బాలికను తీవ్రంగా మందలించి స్కూల్ మాన్పించిన తల్లిదండ్రులు ఇంటివద్దే వుంచుతున్నారు. దీంతో బాలిక తీవ్ర మనోవేదనకు గురయినట్లుంది. ఎలాగయినా తాను ప్రేమించిన యువకుడిని కలవాలని భావించింది. ఇలా అదునుకోసం ఎదురుచూస్తున్న బాలికను దగ్గర్లోని అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేసే తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చిరావాల్సిందిగా తల్లి పంపింది. ఇదే అదునుగా ప్రేమించిన బాలుడిని కలవడానికి బాలిక సిద్దమయ్యింది. 

మొదట తండ్రికి టిఫిన్ బాక్స్ ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లకుండా బాలుడిని కలిసేందుకు వెళ్లింది. చాలారోజుల తర్వాత కలుసుకున్న ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదు కాబట్టి కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం సైకిల్ పై ఇద్దరూ కలిసివెళ్లి ఓ స్నేహితుడికి స్కూల్ బ్యాగ్ ఇచ్చారు. అక్కడినుండి జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు వద్దకు వెళ్ళారు. సైకిల్ అక్కడే పెట్టి, చెప్పులు వదిలి చెరువులో దూకారు.  

అయితే రాత్రయినా ఈ ఇద్దరు ఇంటికి చేరుకోకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు వేరువేరుగా జీడిమెట్ల పోలీసులను ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సిసి కెమెరాలో రికార్డయిన  పుటేజిని పరిశీలించగా బాలుడు, బాలిక సైకిల్ పై చెరువువైపు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిచూడగా సైకిల్, ఇద్దరి చెప్పులు కనిపించాయి. దీంతో చెరువులో వెతకగా బాలిక మృతదేహం లభించింది. ఎంత వెతికినా బాలుడి ఆఛూకీ మాత్రం లభించలేదు. 

బాలుడికి ఈత వచ్చని తల్లిదండ్రులు చెపుతున్నారు. అంటే బాలికతో కలిసి చెరువులో దూకిన తర్వాత ఈతకొట్టుకుంటూ బాలుడు ఒడ్డుకు వచ్చివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ బాలికమాత్రం నీటమునిగి మృతిచెందింది. దీంతో భయపడిపోయి ఎక్కడికయినా పరారయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. బాలుడి ఏమయ్యాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

click me!