అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) హిందువులందరికీ చెందుతుందని, బీజేపీ (BJP)కావాలనే మత రాజకీయం చేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth reddy) అన్నారు. అయోధ్య రామాలయానికి (Ayodhya Ram Temple), భద్రాచలంలోని రామాలయాని (Bhadrachalam Ram Temple)కి తనకు ఏం తేడా కనిపించడం లేదని అన్నారు.
అయోధ్య రామమందిరంలో జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. దీనికి దేశ, విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు,భక్తులు హాజరువుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి దేశంలోని నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదు. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. రామమందిరం హిందువులందరికీ చెందుతుందని, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ట లైవ్ చూడాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే...
దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ‘ఇండియా టుడే’కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను ఏదో ఒక రోజు అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకుంటున్నానని చెప్పారు. రామ మందిరం హిందువులందరికీ చెందుతుందని చెప్పారు. బీజేపీతో సంబంధం లేదని అన్నారు. ‘‘రామాలయం వారికి (బీజేపీ) ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల వారికి ప్రయోజనం కలుగుతుందని వారు చెబుతున్నారంటే.. వారు (బీజేపీ) మత రాజకీయాలు చేస్తోందని తెలుస్తోంది’’ అని ఆయన అన్నారు.
ఆలయం అసంపూర్తిగా ఉన్నందుకే తాము అయోధ్యకు వెళ్లబోమని ఇటీవల నలుగురు శంకరాచార్యులు చెప్పారు. ‘‘ఇలాంటి వాటిని నమ్మేవారు నమ్మొచ్చు. వెళ్లే వారు వెళ్లొచ్చు. ఆలయానికి వెళ్లేందుకు ఇదే (జనవరి 22) మొదటి రోజు కాదు..అలాగే చివరి రోజు కూడా కాదు..’’ అని అన్నారు. తాను తెలంగాణలోని భద్రాచలంలోని రామాలయాన్ని సందర్శించేవాడినని రేవంత్ రెడ్డి చెప్పారు. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు.
రామమందిరం ప్రారంభోత్సవం : నేటినుంచి ప్రాణప్రతిష్టవరకు జరిగే కార్యక్రమాల పూర్తి షెడ్యూల్ ఇదే...
ఇదిలా ఉండగా.. 54వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ రాజధాని దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ‘‘విద్య, ఐటీ, ఫార్మా, క్రీడలు, ఇతర రంగాల్లో ఉపాధి కల్పన నా ప్రధానాంశాలు. టెక్కీలుగా ఉన్న 30 లక్షల మంది యువతపై కూడా నా దృష్టి ఉంది. సేంద్రియ ఆహారంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణలో 10-12 క్లస్టర్లలో ఫార్మా విలేజ్ లను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఉత్తమ విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం’’ అని అన్నారు.
పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లతో తెలంగాణ పోటీ పడకూడదని, ప్రపంచంతో పోటీ పడాలని తాను కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలని, తన దృష్టిలో ప్రపంచం ఒక గ్రామం అని తెలిపారు. పెట్టుబడుల కోసం పెట్టుబడిదారులు స్థిరమైన పాలనను విశ్వసిస్తున్నారని, తమ విధానాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా అభివృద్ధి విధానాలను రూపొందిస్తూనే ఉండాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ ఎస్ పాలనలోనే ఐటీ, ఫార్మా రంగాలు ప్రారంభం కాలేదని, అది 1993లో ప్రారంభమైందని అన్నారు. గత 30 ఏళ్లుగా ఆ రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, అది కొనసాగుతుందని తెలిపారు.