ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల అంశం రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు దారి తీసింది.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై గతంలో భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందని కూడ అప్పట్లో బీజేపీ నేతలు ఆరోపించారు. గత ఏడాదిలో కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విషయమై కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు తదుపరి నోటీసులు జారీ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
undefined
అయితే ఈ నెల 15న విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కవిత ఆ లేఖలో ప్రస్తావించారు.
కవితకు ఈడీ అధికారుల నోటీసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను పక్కదారి పట్టించేందుకే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని కాంగ్రెస్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నోటీసుల పేరుతో బీజేపీ డ్రామాకు తెరలేపిందని కాంగ్రెస్ నేత ఆరోపించారు.
గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్మేలా కాంగ్రెస్ ప్రచారం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా ఇతర పార్టీలకు చెందిన నేతలు, వ్యక్తులు అరెస్టైన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ రహస్య ఒప్పందం కారణంగానే కవిత ఈ కేసులో అరెస్టు కాలేదని కాంగ్రెస్ ఆరోపించింది.
బీజేపీ నుండి బయటకు వచ్చిన నేతలు కూడ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే ఆరోపణలు చేశారు. ఈ పరిణామం బీజేపీ, బీఆర్ఎస్ కు నష్టం కల్గించాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు మరోసారి కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయ డ్రామాగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతుంది. దర్యాప్తు సంస్థలు తమ పనిలో భాగంగానే నోటీసులు జారీ చేశాయని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు లేవని ప్రజలు నమ్మితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం ఉండే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలున్నాయి. ఈ 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకొనేందుకు మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ఈ క్రమంలోనే కవితకు ఈడీ నోటీసుల అంశంపై కూడ ప్రధాన పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.