తెలంగాణ బస్సుల్లో రుచికరమైన స్నాక్స్... టీఎస్ ఆర్టిసి సరికొత్త సర్వీస్

By Arun Kumar P  |  First Published May 27, 2023, 5:24 PM IST

తెలంగాణ ఆర్టిసి బస్సుల్లో దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి గుడ్ న్యూస్. స్నాక్ బాక్స్ పేరిట ప్రయాణికులు చిరుధాన్యాలతో కూడిన స్నాక్స్ అందిస్తోంది టీఎస్ ఆర్టిసి. 


హైదరాబాద్ :తెలంగాణ ఆర్టిసి ప్రయాణికులను ఆకట్టుకుని సంస్థ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బాట పట్టకుండా ఇప్పటికే టీఎస్ ఆర్టిసి లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ గరుడ పేరుతో హైదరాబాద్ నుండి దూర ప్రాంతాలకు తిప్పుతున్న బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్ అందించే ఏర్పాట్లు చేసింది టీఎస్ ఆర్టిసి. 

ఇవాళ్టి(శనివారం) నుండి హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ గరుడు బస్సుల్లో ప్రయాణికులకు స్నాక్స్ అందించనున్నారు.అయితే ఈ స్నాక్స్ కోసం ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేయకుండా టికెట్ రేటులోనే రూ.3‌0 కలిపి తీసుకోనున్నారు. ఇవాళ టీఎస్ ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ ఈ స్నాక్స్ అందించే సర్వీస్ ను ప్రారంభించారు. 

Latest Videos

తెలంగాణ ఆర్టిసి ప్రయాణికులకు అందించే స్నాక్స్  చిరుధాన్యాలతో తయారుచేయనున్నారు. 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరు ధాన్యాల దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన చిరు ధాన్యాలతో తయారుచేసిన కారాతో పాటు చిక్కి, మౌత్ ప్రెష్ నర్, టిష్యూ పేపర్ ప్రయాణికులకు అందించాలని టీఎస్ ఆర్టిసి నిర్ణయించింది. ఈ స్నాక్ బాక్స్ ను హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ గరుడ బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. త్వరలోనే అన్ని బస్సుల్లోనూ ఈ సర్వీస్ ప్రారంభించనున్నట్లు ఆర్టిసి ఉన్నతాధికారులు తెలిపారు. 

Read More  ఆర్డినెన్స్‌ను మోడీ వెనక్కి తీసుకోవాల్సిందే.. కేజ్రీవాల్‌ వెంటే బీఆర్ఎస్‌ : కేసీఆర్

ఇక కొత్తగా ఆర్టిసి బస్సుల్లో స్నాక్స్ అందించే సర్వీసులపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని టీఎస్ ఆర్టిసి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్నాక్ బాక్స్ పై క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేసారు... దీన్ని స్కాన్ చేసి ప్రయాణికులు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ప్రయాణికుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని స్నాక్ బాక్స్ సర్వీస్ లో ఏవయినా మార్పులు చేర్పులు వుంటే చేస్తామని ఆర్టిసి అధికారులు తెలిపారు. 

click me!