మధ్యలో ఈ గవర్నర్ల వ్యవస్థేంది.. అదో అలంకారప్రాయమైన పదవి : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 27, 2023, 4:19 PM IST
Highlights

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా గవర్నర్ల వ్యవస్థపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

గవర్నర్ల వ్యవస్థపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్. శనివారం ప్రగతి భవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి ఆయన సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌ను పాస్ కానివ్వనని ఢిల్లీ గవర్నర్ అంటే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ గవర్నర్ల వ్యవస్థేంది అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్ట్‌కు వెళ్లి బడ్జెట్ పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్ధితి ఎక్కడైనా వుంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

గవర్నర్ అంటే అలంకారప్రాయమైన పదవని.. కర్ణాటకలో కర్రుకాల్చి వాత పెట్టినా కేంద్రం మారకపోతే ఎలా అని సీఎం నిలదీశారు. సుప్రీంకోర్ట్ తీర్పును కేంద్రం గౌరవించకపోతే దేశం పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని.. కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలాగా వుందని కేసీఆర్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టం చేశారు. గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోందన్నారు. 

ALso Read: ఆర్డినెన్స్‌ను మోడీ వెనక్కి తీసుకోవాల్సిందే.. కేజ్రీవాల్‌ వెంటే బీఆర్ఎస్‌ : కేసీఆర్

బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్రం చాలా ఇబ్బంది పెడుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  ఆర్ధిక పరిమితులు విధించడం, దాడులతో వేధించడం వంటి పనులకు బీజేపీ ఒడిగడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. దీనిని యావత్ దేశం చూస్తూ వుందన్నారు. ఢిల్లీలో మూడు సార్లు ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీని సాధించిందని.. అయినా మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారని కేసీఆర్ దుయ్యబట్టారు. చివరికి సుప్రీంకోర్ట్‌కు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారుల బదిలీలన్ని ఢిల్లీ ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని సీఎం చెప్పారు. ఆర్ధినెన్స్‌ ఉపసంహరించుకునే పోరాటంలో అరవింద్ కేజ్రీవాల్‌కు బీఆర్ఎస్ మద్ధతుగా వుంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్ధితులు వున్నాయన్నారు.  

click me!