తెలంగాణ.. వైన్స్ కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల.. తొలుత లాటరీ వాళ్లకే..

By team teluguFirst Published Nov 8, 2021, 9:36 AM IST
Highlights

మద్యం దుకాణాల (wine shops) కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. రిజర్వేషన్ల (reservations) అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసింది.

మద్యం దుకాణాల (wine shops) కేటాయింపుల్లో రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు ఏ4 లిక్కర్‌ షాప్‌ (వైన్స్‌)లకు రిజర్వేషన్ల ప్రకారం లాటరీ తీసే బాధ్యతలను అప్పగించారు. ఈ కమిటీలో జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌, గిరిజనాభివృద్ధి అధికారి, బీసీ సంక్షేమ అధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి సభ్యులుగా ఉంటారు. రిజర్వేషన్ల అమలు బాధ్యతను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. 

జిల్లా యూనిట్‌గా లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలకు రిజర్వేషన్ల కేటాయింపు చేపట్టనున్నారు. రోస్టర్‌ పద్ధతిలో.. మొదటి లాటరీ ఎస్టీలకు, రెండో లాటరీ ఎస్సీలకు, మూడో లాటరీగౌడ కులస్తులకు ఇలా రిజర్వేషన్లను కేటాయించనున్నారు. రిజర్వేషన్ల ప్రకారం షాపుల కేటాయింపు పూర్తయ్యాక, మిగిలిన వాటికి ఓపెన్‌ డ్రా ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో‌గ్రఫీ చేయనున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో షాపులను ఎస్టీలకే కేటాయించనున్నారు. అక్కడ ఇతర రిజర్వేషన్లు వర్తించవు. మిగిలిన ప్రాంతాల్లో ఎస్టీలకు పరిమిత సంఖ్యలో షాపులను కేటాయించనున్నారు.

Also read: నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ సమీక్ష.. తెలంగాణలో కొత్తగా మరిన్ని మద్యం దుకాణాలు..!

ఇక, తెలంగాణలో నూతన మద్యం పాలసీకి (Telangana new liquor policy) సంబంధించిన ఉత్తర్వులును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ డిసెంబర్ 1 నుంచి వచ్చే 2023 నవంబర్‌ 30 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. మద్యం దుకాణాల కోసం టెండర్‌ దరఖాస్తు ఫీజును గతంలోలాగే రూ.2 లక్షలుగా నిర్ధారించగా, ఎక్సైజ్‌ ఫీజును కూడా పాత స్లాబుల్లోనే కొనసాగించారు. షాప్ రాకపోయినా ఈ దరఖాస్తు ఫీజులను తిరిగి ఇవ్వరు. ఇక, 5వేల జనాభా వరకు ఉంటే 50 లక్షలు,  5వేల నుంచి50 వేలరకు జనాభా ఉంటే రూ. 55లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉంటే రూ. 60 లక్షలు లైసెన్స్‌ ఫీజు కట్టాలి. పర్మిట్‌రూం కోసం అదనంగా ఏడాదికి రూ. 5 లక్షలు చెల్లించాలి. వాకిన్‌ స్టోర్‌ కావాలంటే మరో రూ. 5 లక్షలు అదనంగా చెల్లించాలి. 

Also read: ‘‘నన్నే ఆపుతావారా?’’...సీఐపై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మొత్తం షాపులో గౌడ్‌లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్‌ ఇవ్వనున్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపులను జిల్లాలు యూనిట్‌గా చేపడతారు. ఆ జిల్లాలో సదరు సామాజికవర్గ జనాభాను రాష్ట్రంలోని ఆ సామాజికవర్గ జనాభాతో పోల్చి కేటాయిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరిపేందుకు అవకాశం కల్పించారు.

click me!