Hyderabad: తెలంగాణలో ఈ సారి రుతుపవనాల ప్రభావం తక్కువగానే ఉంటుందనీ, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర, మధ్య జిల్లాలైన ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ (అర్బన్, రూరల్) జిల్లాల్లో సాధారణం కంటే 35 నుంచి 55 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
Telangana monsoon-IMD : దేశంలో సాధారణ రుతుపవనాలు వస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం అంచనా వేసింది. ఇదే సమయంలో తెలంగాణలో ఈసారి రుతుపవనాల ప్రభావం తక్కువగానే ఉంటుందనీ, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. సంభావ్య వర్షపాత అంచనా మ్యాప్ ఆధారంగా తెలంగాణకు రుతుపవనాల దృక్పథం అంత మెరుగ్గా కనిపించడం లేదని తెలిపింది.
తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాలైన ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ (అర్బన్, రూరల్) జిల్లాల్లో సాధారణం కంటే 35 నుంచి 55 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణాది జిల్లాల్లో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో సాధారణ వర్షపాతం 35 నుంచి 55 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది.
కాగా, ఈ వేసవిలో ఎండలు మండిపోనున్నాయని ఐఎండీ పేర్కొంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ వేసవిలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి, 33 జిల్లాల్లో 28 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని తెలిపింది. తాజాగా ఆదిలాబాద్ లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందని టీఎస్ డెవలప్ మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ పేర్కొంది. అలాగే, జీహెచ్ఎంసీ పరిధిలో అమీర్ పేట, మైత్రివనంలో 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ప్రధానంగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని ఐఎండీ-హైదరాబాద్ డైరెక్టర్ కె.నాగరత్న తెలిపారు. మూడు రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. రానున్న మూడు రోజుల పాటు నగరంలో పొడి వాతావరణం కొనసాగుతుందని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.