
Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు స్పందిస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నాయి. కేటాయింపుల్లో ప్రధాన్యం లేకపోవడంపై రెండు తెలుగు రాష్ట్రాల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ పరిశ్రమ మంత్రి కేటీఆర్ (KTR) కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ (Telangana) ఈ దేశంలో లేదనే విధంగా.. పేదలకు పనికొచ్చేది ఒక్కటి లేని విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు అన్యాయం చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్ మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో మూడు వందల కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జవహర్ నగర్ లో చిన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ (KTR) తో పాటు మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union budget 2022) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ (Telangana)కు అన్యాయం చేశారని తెలిపారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికి వచ్చేది ఒక్కటీ లేదని అన్నారు.
బడ్జెట్ కేటాయింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు విజ్ఞప్తులు చేసిందని తెలిపిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులన్నింటినీ బుట్టదాఖలు చేసి Telangana అసలు దేశంలో భాగమే కాదు అన్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా సహకారం అందించకపోయినా.. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్లో ఆదర్శంగా ముందుకు సాగుతున్నదని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. తెలంగాణకు కేంద్రం బడ్జెట్లో నిధులు ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)సైతం కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ దారుణమైన బడ్డెట్ ప్రవేశ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. మహాభారతంలోని శాంతి పర్వం శ్లోకాన్ని చదివి వినిపించారనీ. కానీ అందులో ప్రసావించినవి.. ఆ ధర్మమని, ఆసత్యమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఎవరికీ లాభం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం తరహాలో ఉందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ జనాభా చాలా పెరిగింది కానీ, వారి జనాభా విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చెపుతుందని మండిపడ్డారు. రైతులు, సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీలు.. ఇలా ఎవరికీ పనికిరాని బడ్జెట్ ఇది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.