ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్

First Published Mar 12, 2018, 4:34 PM IST
Highlights
  • మాది భగత్ సింగ్ పోరాటం లాంటిది
  • మీది పార్లమెంటుపై ఉగ్రదాడి లాంటిది
  • మాట్లాడలేకనే మీరు దాడులు చేస్తున్నారు
  • ఆనాడు మేం చేసిన పనికి గర్వపడుతున్నాం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. ఆయన మాటలివి.

మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ వారు మాటల రూపంలో విమర్శ చేయండి. మాటల రూపంలో దాడి చేయండి. ఆ అవకాశం ఉన్నప్పుడు ఫిజికల్ గా దాడి చేయడం ఎక్కడి పద్ధతి? వందేళ్ల చరిత్ర కల కాంగ్రెస్ పార్టీ చేసే పని ఇదేనా? ఈ దాడిని జానారెడ్డి ఏరకంగా సమర్థిస్తారు. ఆయనంటే మాకు గౌరవం ఉంది. సుదీర్ఘ కాలం ఆయన మంత్రిగా పనిచేశారు. ఇది ప్రజాస్వామ్య విలువలు పెంచడానికా? తుంచడానికా? జానారెడ్డి చెప్పాలి.

సభలో కాంగ్రెస్ వారు మాట్లాడడానికి ఏం లేదు. వారేమీ మాట్లాడలేకపోతున్నారు. మా దగ్గర సమాధానం ఉంది. మీరు ప్రస్టేషన్ లో ఉన్నారు. అందుకే ఈ రకమైన దాడులు చేస్తున్నారు. ప్రశ్నించడం చేతగాక ఈ రకమైన దాడులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నది. బిఎసి సమావేశంలో కూడా అన్ని పక్షాలు దాడిని ఖండించాయి. స్పీకర్ కు అన్న అధికారాలు ఇవ్వడం జరిగింది. తిరిగి ఈ పరిణామాలు శాసనసభలో ఎప్పుడూ జరగకుండా స్పీకర్ కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.  

ఉద్యమ సమయంలో మేము గొడవ చేసిన పరిస్థితి వేరు. ఈరోజు పరిస్థితి వేరు. ఆ రోజుల్లో మేము మాట్లాడేందుకు మైక్ ఇచ్చే అవకాశం లేదు. తెలంగాణ గోసను వినిపించేందుకు పోరాటం చేశాము. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును వినిపించాము. తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్యను మేము సభలో వినిపించాము. దానికి మేం గర్వపడుతున్నాము. కానీ ఆరోజు ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. ఏ అంశంపై అయినా మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని మేము చెప్పాం. కానీ ఆరోజు తెలంగాణ మాట కూడా సభలో వినే పరిస్థితి లేదు.

కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మీరు ఏదైనా అడగండి. మేము సమాధానం చెబుతాం. ఇతర రాష్ట్రాల శాసనసభలకు మార్గదర్శకత్వం వహించేలా మన సభను జరపాలని సిఎం కేసిఆర్ ప్రయత్నిస్తున్నారు. మీరు మళ్లీ అధికారం రాదు అన్న ఉద్దేశంతోనే అసహనానికి పాల్పడుతున్నారు. స్వాతంత్ర్య కాలంలో భగత్ సింగ్ పార్లమెంటు మీద దాడి చేశారు. తర్వాత కాలంలో ఉగ్రవాదులు కూడా పార్లమెంటు మీద దాడికి పాల్పడ్డారు. కానీ.. మేము చేసిన పోరాటం భగత్ సింగ్ లాంటి పోరాటం అయితే.. మీరు చేసింది మాత్రం ఉగ్రవాదులు చేసిన ఉగ్ర దాడి లాంటిది.

రాజ్యాంగాధినేత అయిన గవర్నర్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం ఎంత దారుణం. గవర్నర్ కే సూటి పెట్టి కొట్టిన అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడడం ఎంత దారుణం. ప్రజాస్వామ్యవాదులు చేసే పని ఇదేనా? వందేళ్ల కాంగ్రెస్ పార్టీకి ఇది తగునా?

సభ ప్రారంభమై ఐదు నిమిషాల దాకా ఏ పోలీసులు ఉన్నారు. గవర్నర్ మీద దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఎంటరయ్యారు తప్ప సభ ప్రారంభానికి ముందే కోమటిరెడ్డి తన మీద దాడి చేశారంటే ఎవరు నమ్ముతారు? అయినా అన్ని కెమెరాలు ఉన్నాయి లైవ్ టెలికాస్ట్ ఉంది. ఎక్కడా పోలీసులు దాడికి పాల్పడలేదు కదా?

click me!