నెటిజన్లకు తెలంగాణ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

First Published Nov 3, 2017, 6:38 PM IST
Highlights
  • లీడర్ల పేరుతో నకిలీ ఖాతాలు రన్ చేస్తే కఠినచర్యలు
  • అభిమానంతో చేసినా చట్టం ఒప్పుకోదు
  • వెంటనే ప్రభుత్వం పేరుతో, నాయకుల పేరుతో ఖాతాలు క్లోజ్ చేయండి

రాష్ట్ర ప్రభుత్వం పేరిట, ప్రజాప్రతినిధుల పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణ ఐటి విభాగం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనను ఉన్నది ఉన్నట్లు దిగువన ఇస్తున్నాం.  నెటిజన్లు అందరూ జాగ్రత్తగా చదివి అప్రమత్తంగా ఉండగలరు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖలోని డిజిటల్ మీడియా విభాగం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సీపీఆర్వో కార్యాలయంతో సమన్వయం చేసుకుని Telangana CMO [www.facebook.com/TelanganaCMO] పేరిట అధికారిక ఫేస్‌బుక్ పేజీ నిర్వహిస్తుందని తెలిపింది.

ఐటీ శాఖ మంత్రి పేరిట - www.facebook.com/ITMinisterTelangana అనే పేజీని కూడా డిజిటల్ మీడియా విభాగమే నిర్వహిస్తుంది. 

రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా ప్రతినిధులు కొందరు కూడా ఫేస్‌బుక్కులో అధికారిక పేజీలు కలిగి ఉన్నారు. అన్ని అధికారిక ఫేస్‌బుక్ పేజీలకు ఆ పేజీ పేరు పక్కన నీలి రంగు "వెరిఫైడ్" టిక్ మార్కు (చిత్రం జతచేయబడింది)  ఉంటుంది. 

ఫేస్‌బుక్ అనేది ఒక ప్రైవేటు ప్లాట్‌ఫారం కాబట్టి అందులో ఎవరైనా ఖాతా తెరిచే అవకాశం ఉంది. కొద్ది మంది వ్యక్తులు అత్యుత్సాహంతోనో, ప్రభుత్వం మీదనో, నాయకుల మీదనో ఆపేక్షతోనో వారి పేర్ల మీద ఫేస్‌బుక్ ఖాతాలు తెరుస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ మీడియా విభాగం మానిటర్ చేసి, ఆయా వ్యక్తులను హెచ్చరించడం జరుగుతుంది. వారు సదరు ఖాతాను కొనసాగించిన పక్షంలో  రాష్ట్ర పోలీస్ శాఖలోని సైబర్ క్రైంస్ విభాగం, ఫేస్‌బుక్ యాజమాన్యం సహాయంతో అట్టి నకిలీ ఖాతాలను తొలగించడం జరుగుతుంది. 

గత రెండేళ్లలో ఇట్లా ప్రభుత్వాన్ని, ఎన్నికైన ప్రజాప్రతినిధులను అనుకరిస్తూ తెరిచిన నకిలీ ఖాతాలు సుమారు 130 వరకూ ఈ విధంగా తొలగించడం జరిగింది.

ఇవ్వాళ కూడా దాదాపు పదిహేను నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను తొలగించే ప్రక్రియ మొదలైంది.    

కొద్ది మంది వ్యక్తుల బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల ఇటువంటి నకిలీ ఖాతాల సృష్టి ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ మేం మానవతా దృక్పథంతోనే ఎవరి మీదా కఠిన చర్యలు తీసుకోలేదు. కానీ మళ్లీ మళ్లీ అదే పొరపాటు చేసినవారి మీద  చర్యలు తీసుకుంటాం.  

ప్రజలకు, మీడియా మిత్రులకు మా విజ్ఞప్తి:

ప్రభుత్వ/ప్రజాప్రతినిధుల అధికారిక ఫేస్‌బుక్ పేజీలకు నీలి రంగు వెరిఫైడ్ టిక్ మార్కు ఉంటుందని గమనించగలరు. అట్లాగే మీ దృష్టికి ఏమైనా నకిలీ ఫేస్‌బుక్ పేజీలు వచ్చినచో దయచేసి డిజిటల్ మీడియా విభాగ సంచాలకులకు ఈ దిగువ ఈమెయిల్ ఐడీపై తెలియజేయగలరు.

dir_dm@telangana.gov.in

Dileep Konatham
Director - Digital Media
IT, E & C Department
Government of Telangana

ఈ విధంగా నోట్ వెల్లడించింది తెలంగాణ సర్కార్.

 

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

click me!