టిఆర్ఎస్ లో కొండా సురేఖ తుఫాన్..

First Published Nov 3, 2017, 4:47 PM IST
Highlights
  • టిఆర్ఎస్ వీడతారని జోరుగా ప్రచారం
  • కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు రూమర్లు
  • బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన టిఆర్ఎస్ నాయకత్వం
  • వరంగల్ లో ఎర్రబెల్లికి కొండా దంపతులకు మధ్య ముదురుతున్న వైరం

కొండా సురేఖ పేరు వినగానే ఓరుగల్లు ఆడబిడ్డ అంటారు. ఆమె గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి అండగా నిలిచి సంచలనం రేకెత్తించారు. తెలంగాణవాదులను కొట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేసిఆర్, కోదండరాం, హరీష్ రావులను టివిల ముందు పరుషంగా ధూషించి వార్తల్లోకి ఎక్కారు. అదంతా గతం.

తర్వాత వైఎస్ ఫ్యామిలీని వదిలి టిఆర్ఎస్ గూటికి చేరారు. తెలంగాణ అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ముందే టిఆర్ఎస్ లో చేరడంతో ఆమెను ఓరుగల్లు జనాలు గెలిపించారు. ఎన్నికల వేళ కేసిఆర్ ఆమెకు మాటిచ్చారు. ఎన్నికల సభలోనే ప్రకటించారు... ఏమనంటే కొండా సురేఖను జౌలి శాఖ మంత్రిగా నియమిస్తానని ప్రామిస్ చేశారు. కారణాలేంటో తెలియదు కానీ తెలంగాణలో ఆడవాళ్లకు మంత్రి పదవులు దక్కలేదు. దీంతో సురేఖకు కూడా మొండిచేయి తప్పలేదు.

అయితే మూడేళ్ల పాటు కొండా సురేఖ ఉన్నదా లేదా అన్నట్లు వ్యవహరించారు. జిల్లాకే పరిమితమయ్యారు. అంతకంటే నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాను శాసించిన కొండా సురేఖ కుటుంబం మూడేళ్ళ కాలంలో నియోజకవర్గానికి పరిమితమై లో ఫ్రొఫైల్ మెంటెయిన్ చేశారు. కానీ ఎందుకో గత కొద్దిరోజులుగా కొండా సురేఖ స్వరం పెంచిన వాతావరణం ఉంది.

వరంగల్ జిల్లాలో గత నెలలో టిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు కొండా సురేఖ వర్గానికి మధ్య వార్ నడిచింది. రెండు వర్గాల మధ్య అగ్గి పుట్టింది. అయితే తాము తగ్గేదే లేదని కొండా సురేఖ వర్గం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తుపాను లా మరో వార్త వచ్చింది. కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నదని లీక్ వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ మారే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

ఒకప్పుడు తమ పార్టీలో కీలకనేతగా ఉన్న కొండా సురేఖ అనంతరం టీఆర్ఎస్‌‌ కండువా కప్పుకున్నా.. అక్కడ వారికి అవమానాలే మిగులుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నయి. రెండు సీట్లు ఇస్తే కాంగ్రెస్‌లోకి చేరతామంటూ తమ పార్టీ సీనియర్ నేతలతో రాయబారం నడిపినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పరకాల నుంచి సురేఖ తన కుమార్తెను బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కొండా దంపతుల డిమాండ్‌పై వరంగల్ నేతలతో పీసీసీ చర్చిస్తోందని చెబుతున్నారు.

అయితే కొండా సురేఖ రాకను పలువురు నేతలు వ్యతిరేకించగా.. మరికొందరు నేతలు సాదారంగా ఆహ్వానించడానికి సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. కొండా సురేఖ డిమాండ్‌పై నిశితంగా ఆలోచించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రస్తుతం కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాన్ని మాత్రమే ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.! అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేతలతో కొండా సురేఖ చర్చలు జరుపుతున్నట్లు తెలుసుకున్న టీఆర్ఎస్ అధిష్టానం ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వార్త రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. తుదకు కొండా సురేఖ సైతం ఈ వార్తపై స్పందించాల్సి వచ్చింది. తాను కాంగ్రెస్ కు పోయే ప్రసక్తే లేదని కొండా సురేఖ చెప్పారు. తనకు వైఎస్ రాజకీయ జన్మనిస్తే, కేసిఆర్ రాజకీయ పునర్జన్మ ఇచ్చారని చెప్పుకున్నారు. బతికి ఉన్నంత వరకు టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కనుమరుగైపోయిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.

ఈ ప్రకటన అయితే ఇచ్చినా.. కొండా సరేఖ పరిస్థితి టిఆర్ఎస్ లో ఏమాత్రం బాగాలేదని, తీవ్ర ఇబ్బందికరంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సభలోనే జౌలిశాఖ మంత్రి పదవి ఇస్తానని కేసిఆర్ చెప్పారు.. కానీ మూడేళ్లు దాటినా మంత్రి పదవి ఇవ్వలేదు కదా? ఆ కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని కొండా సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు పలుకుబడి పెరిగిపోవడం కూడా కొండా దంపతులను కలవరపాటుకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారన్న వార్తలు రావడం  చర్చనీయాంశమైంది. అయితే టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెబుతున్నా... ఎప్పటి వరకు కొనసాగుతారన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

చంద్రబాబుకు గుడి కట్టిస్తామంటున్న హిజ్రాలు

ఈ వార్తతోపాటు మరిన్ని తాజా వార్తలకోసం కింద క్లిక్ చేయండి

click me!