
హైదరాబాద్: కమ్మ, వెలమ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. వెలమ, కమ్మ సంఘాలకు భూ కేటాయింపును హైకోర్టు తప్పుబట్టింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని కమ్మ, వెలమ కుల సంఘాలకు కమ్యూనిటీ భవన్‌ల నిర్మాణానికి ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. అయితే దీనిని వ్యతిరేకిస్తూ కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ సందర్భంగా పిటిషన్ తరఫు న్యాయవాదితో పాటు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ తమ వాదనలను వినిపించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర చర్యపై హైకోర్టు సీజే ధర్మాసనం.. అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం కులాంతర వివాహాలకు ప్రోత్సాహకం ఇవ్వవచ్చని.. అయితే కులతత్వాన్ని ప్రోత్సహించడం సమాజాన్ని మరింత విడదీయడమేనని ధర్మాసనం పేర్కొంది. కులాల ప్రాతిపదికన భూ కేటాయింపులను కోర్టు గట్టిగా వ్యతిరేకించింది. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు భూమిని కేటాయించడానికి రాజ్యాంగపరమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొంది.
Also Read: ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరం.. గవర్నర్ తమిళిసై
ఇందుకు సంబంధించి నేటి విచారణ సందర్భంగా.. వెలమ, కమ్మ సంఘాలకు కేటాయించిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అణగారిన వర్గాలు భూ కేటాయింపు చేస్తే అర్థం చేసుకోవచ్చని.. బలమైన కుల సంఘాలకు భూములెలా ఇస్తారని ప్రశ్నించింది. ఇక, వినాయక్ రెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.