టీఎస్‌పీఎస్‌పీ నూతన చైర్మెన్ మహేందర్ రెడ్డి: గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర

By narsimha lode  |  First Published Jan 25, 2024, 1:49 PM IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.


హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి  నియామకాన్ని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  గురువారం నాడు ఆమోదించారు.టీఎస్‌సీఎస్‌సీ సభ్యులుగా  పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై.రామ్మోహన్ రావు,రిటైర్డ్ ఐఎఎస్ అధికారి అనితా రామచంద్రన్ లను  ప్రభుత్వం నియమించింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం  సిఫారసు చేసింది.ఈ విషయమై  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు బుధవారం నాడు  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో  భేటీ అయ్యారు. రిపబ్లిక్ డే ఉత్సవాలను పురస్కరించుకొని గవర్నర్ ను ఆహ్వానించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నూతన చైర్మెన్ గా  మహేందర్ రెడ్డి నియామకానికి సంబంధించి ఆమోదించాలని కోరారు. 

Latest Videos

undefined

also read:అలాంటి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి: కౌశిక్ రెడ్డి పై గవర్నర్ పరోక్ష కామెంట్స్

ఈ విషయమై  గురువారంనాడు  మహేందర్ రెడ్డి నియామాకానికి  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు.  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మెన్ పదవికి  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్,రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి తదితరుల పేర్లను  రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. అయితే  రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళి టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ పదవిని తీసుకొనేందుకు అంగీకరించలేదని సమాచారం.

also read:తెలంగాణలో పెన్షన్ పెంపు: ఎప్పటి నుండి అమలు కానుంది?

 రిటైర్డ్ ఐపీఎస్ అధికారి  ప్రవీణ్ కుమార్  ప్రభుత్వం  ఇచ్చిన ఆఫర్ ను తీసుకొనేందుకు ఆసక్తి చూపలేదు. రాజకీయాల్లో కొనసాగుతానని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చెప్పారని సమాచారం.  దీంతో రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ గా ప్రభుత్వం నియమించింది.

తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పేపర్లు లీకయ్యాయి.  గత ఏడాది ఈ విషయం వెలుగు చూసింది.  2023 మార్చి మాసంలో పేపర్ల లీక్ వ్యవహరం వెలుగు చూసింది.   2022 లో కూడ  నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైనట్టుగా  సిట్ దర్యాప్తు బయట పెట్టింది.

గత ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేస్తామని సీఎం అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. యూపీఎస్‌సీ తరహాలోనే  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.  ఈ మేరకు ఐఎఎస్ అధికారుల కమిటీ  అధ్యయనం చేసింది.  ఈ నివేదికను ప్రభుత్వానికి అందించింది.

మరో వైపు గతంలో టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ గా పనిచేసిన జనార్థన్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు  రాజీనామాలు సమర్పించారు.ఈ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. దీంతో  కొత్తగా చైర్మెన్ పదవి కోసం ప్రభుత్వం ధరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ధరఖాస్తులను వడపోసి మహేందర్ రెడ్డిని నియమించింది. మహేందర్ రెడ్డి నియామాకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.

గతంలో రద్దైన పరీక్షలతో పాటు వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడంపై కొత్త చైర్మెన్ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.  పలు ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను  ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనుంది.

click me!