
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్” అనే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు దీనిని మతపరమైన రాజకీయాలుగా చూస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోంది. పాలన, అభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి అంశాలపై చర్చించకుండా ఓటు బ్యాంకు కోసం మతాన్ని ఆయుధంగా వాడుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే, “జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో ఓటమి భయం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఇప్పుడు ఆయన హిందూ ఓట్లను పక్కనబెట్టి కేవలం ముస్లిం ఓట్లపైనే దృష్టి పెట్టారు” అని అన్నారు.
రామచందర్ రావు మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సమాజం అంటే ఓటు బ్యాంకే. వారిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్న ఉద్దేశం లేదు. నిజంగా ముస్లింలకు న్యాయం చేయాలంటే వారికి విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాలు కల్పించాలి. కానీ కాంగ్రెస్ మాత్రం వారిని ఓటు కోసమే గుర్తిస్తోంది” అని అన్నారు. అలాగే, “ముస్లింలకు గౌరవం ఉందంటే అది కాంగ్రెస్ వల్లే అని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన. ఇది సమాజంలో విభజనకు దారితీసే ప్రమాదకరమైన ధోరణి” అని విమర్శించారు.
బీజేపీ నాయకుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. “కేవలం 20 శాతం ముస్లిం ఓట్ల కోసం 80 శాతం హిందూ ఓట్లను నిర్లక్ష్యం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. లౌకికవాదం పేరుతో మతపరమైన లాభం పొందే ప్రయత్నం సిగ్గుచేటు. నిజమైన లౌకికత అంటే అందరికీ సమాన హక్కులు ఇవ్వడం. కానీ కాంగ్రెస్ మాత్రం ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తోంది” అని అన్నారు.