
Telangana Local Body Elections : తెలంగాణ ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు తప్పడంలేదు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇటు హైకోర్టు, అటు సుప్రీం కోర్టు జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటూ తేల్చుకోలేకపోతోంది. పెంచిన బిసి రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు న్యాయస్థానాలు అనుమతించడంలేదు... ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశాక రిజర్వేషన్ల జీవోను రద్దుచేయడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఇదే హైకోర్టు ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదు.. ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల కమీషన్, ప్రభుత్వంతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఈసి తరపు న్యాయవాదికి సూచించిన హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించిపోయాయి... అందువల్లే రిజర్వేషన్ల పెంపు జీవోను రద్దు చేశామని హైకోర్టు తెలిపింది. రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించుకోవాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందిగా… మరి ఎందుకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకు ఎన్నికలు నిర్వహించడంలేదని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాది కోరారు... దీంతో విచారణను రెండు వారాలకు వాయిదావేసింది తెలంగాణ హైకోర్టు.