Telangana: బీజేపీ-కాంగ్రెస్ ల ను దెబ్బ‌కొట్టే టీఆర్ఎస్ వ్యూహం? అందుకేనా ముందస్తు ఎన్నికలకు? కేసీఆర్ ప్లాన్ ఇదే

Published : Mar 10, 2022, 02:55 PM IST
Telangana: బీజేపీ-కాంగ్రెస్ ల ను దెబ్బ‌కొట్టే టీఆర్ఎస్ వ్యూహం? అందుకేనా ముందస్తు ఎన్నికలకు? కేసీఆర్ ప్లాన్ ఇదే

సారాంశం

Telangana: ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌లు ముందస్తు ఎన్నిక‌ల కోస‌మేనా?  బీజేపీ-కాంగ్రెస్ లు బ‌ల‌ప‌డ‌కుండా వ్యూహ ర‌చ‌న చేసి మ‌రీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్నారా? అంటే అవుననే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.   

Telangana: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ముందస్తు ఎన్నిక‌ల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు సైతం ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. రాష్ట్రంలో నిజంగానే ముందస్తు ఎన్నికలు వస్తాయా..?  అలా అయితే, ఏ అంశాల‌తో కేసీఆర్‌ అందుకు సిద్దమ‌య్యారు?  ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికే రాష్ట్రంలో భారీ ఎత్తున కొలువుల జాత‌ర ప్ర‌క‌టించారా?  ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు క‌ళ్లెం వేసే అన్ని అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజకీయ వ‌ర్గాల్లోనూ.. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మనిస్తే ఇది స్పష్టంగా తెలుస్తోంది. అయితే, సీఎం కేసీఆర్‌ను ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి ప్రేరేపించే విష‌యాలు, కాంగ్రెస్‌, బీజేపీల దూకుడుకు అడ్డుకునే ఆయుధాలు గమ‌నిస్తే.. చాలానే ఉన్నాయ‌ని చెప్పాలి. 

ముంద‌స్తుకు ఎన్నిక‌ల‌కు వెళ్లే సంకేతాలు ఇవేనా..? 

సీఎం కేసీఆర్ మ‌రోసారి అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు గమనిస్తే అర్థ‌మ‌వుతుంది. దీని కోసం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌నే సంకేతాలు సైతం ఆయ‌న పంపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్న సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లను చూడ‌వ‌చ్చు. మ‌రీ ముఖ్యంగా రూ.2.56లక్షల కోట్లతో 2022-23  భారీ బడ్జెట్‌  తీసుకురావడమే కాకుండా సంక్షేమానికి అధిక ప్రాముఖ్య‌త ఇచ్చారు. అధిక‌ర పార్టీ ఎమ్మెల్యేల‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌దేప‌దే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని పేర్కొన‌డం ఇందుకు బ‌లం చేకూరుస్తోంది.

కోలువుల జాత‌ర ముంద‌స్తు కోస‌మేనా?

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు దారి తీసిన అంశాల్లో ఉద్యోగాల అంశం కూడా ఒక‌టి. అయితే, రాష్ట్ర ఏర్ప‌డిన త‌ర్వాత కూడా ఉద్యోగాల నోటిఫికేష‌న్లు పెద్ద ఎత్తున రాక‌పోవ‌డంతో ఇటీవ‌ల కాలంలో సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వంపై నిరుద్యోగుల‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర విర్శ‌లు గుప్పించాయి. ఈ అంశం టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఇమేజ్ ను కూడా త‌గ్గించింద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలోనే సీఎం కేసీఆర్ ఏకంగా 90 వేల‌కు పైగా ఉద్యోగాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు నిరుద్యోగుల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త కాస్తా త‌గ్గింద‌ని చెప్పాలి. ఎందుకుంటే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే నిరుద్యోగులు కేసీఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకాలు చేస్తున్న ఘ‌ట‌న‌లు దీనికి అద్దం ప‌డుతున్నాయి. ఒక్క‌సారిగా ప్ర‌తిప‌క్షాలకు ఇన్ని రోజుల‌గా ఆయుధంగా ఉన్న ఉద్యోగాల నోటిఫికేష‌న్ అంశం క‌నుమ‌రుగైంది. ఇది అధికార పార్టీ ముంద‌స్తుకు వెళ్తే.. అనుకూలంగా మారిన అంశాల్లో ఒక‌టి కానుంది. 

గ‌తంలోనూ..  

గత ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అనూహ్య మెజారిటి సాధించారు. గ‌ట్టిపోటీ ఇస్తాయ‌నుకున్న ప్ర‌తిప‌క్షాలు చ‌తికిలప‌డ్డాయి.  2019లో సాధారణ ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఒక ఏడాది ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి 2018 డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లారు. గులాబీ బాస్ ముంద‌స్తు ఎన్నిక‌ల ప‌క్కా ప్ర‌ణాళిక‌తో  టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించింది. ఈ ఏడాది కూడా అదే రీపీట్ చేసేందుకు సీఎం కేసీఆర్ వ్యూహ ర‌చ‌న‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు 2023 డిసెంబర్‌లో జరగాలి. అయితే, అనుకున్న ఫ‌లితం రావాలంటే ముంద‌స్తుకు వెళ్ల‌డం మంచిద‌ని టీఆర్ఎస్ భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాబ‌ట్టి ఈ ఏడాది డిసెంబర్‌లోనే అసెంబ్లీని ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. 

ఈ ఏడాది లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఎందుకంటే..? 

రాష్ట్రంలో బీజేపీ మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార పీఠం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీ అగ్ర‌నేత‌లు సైతం తెలుగు రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెంచుతున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగిసే 2024 వ‌ర‌కు అగితే.. బీజేపీ రాష్ట్రంలో మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం వెలువ‌డిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాష్ట్ర బీజేపీకి బూస్టులా ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోలేదు. కాబ‌ట్టి బీజేపీకి అడ్డుక‌ట్ట వేయాలంటే ముంద‌స్తుకు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని టీఆర్ఎస్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో కీల‌క అంశం.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తే.. గుజ‌రాత్ తో పాటు తెలంగాణ‌కు అసెంబ్లీకి ఒకే సారి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయి. కాబ‌ట్టి ప్రధాని మోడీ, అమిత్ షాల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిలిచే గుజ‌రాత్ పై బీజేపీ అగ్ర‌నేత‌లు త‌ప్ప‌కుండా దృష్టి కేంద్రీక‌రిస్తారు. కాబ‌ట్టి తెలంగాణ‌లో వారి ప్ర‌భావం త‌గ్గించ‌వ‌చ్చు అనేది టీఆర్ఎస్ భావ‌న కావ‌చ్చు.

ముంద‌స్తుతో కాంగ్రెస్ ను లేవ‌కుండా చేసే వ్యూహం.. ! 

ఇక కాంగ్రెస్ కు చెక్ పెట్టాల‌నే టీఆర్ఎస్ వ్యూహం కూడా ఇందులో క‌నిపిస్తోంది. ఎందుకంటే మ‌న ప‌క్క రాష్ట్రమైన కర్నాట‌క శాసనసభ పదవీకాలం 2023 మే 24న ముగియనుంది. కాబ‌ట్టి అక్క‌డ జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీ-కాంగ్రెస్ లు బ‌ల‌మైన పార్టీలుగా ఉన్నాయి. అక్క‌డ ఏ పార్టీ విజ‌యం సాధించినా తెలంగాణ పై ప్ర‌భావం చూపే అవ‌కాలున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అక్క‌డ అధికారంలోకి వ‌స్తే.. తెలంగాణ కాంగ్రెస్ కు బూస్టులా ప‌నిచేస్తుంది. అప్పుడు టీఆర్ఎస్‌కు బీజేపీతో పాటు కాంగ్రెస్ పోరు తో ఒత్తిడి పెరుగుతుంది. కాబ‌ట్టి బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు ఏ మాత్రం ప్ర‌భావం చూప‌కుండా ఉండే స‌మ‌యం అంటే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డమేన‌ని టీఆర్ఎస్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కాబ‌ట్టి ఈ ఏడాదిలోనే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చు. ఇక దీనిలో భాగంగానే ప్ర‌స్తుతం గులాబీ బాస్ తీసుకుంటున్న దూకుడు చ‌ర్య‌లుగా మ‌నం చూడ‌వ‌చ్చు. మ‌రికొంత కాలం అగితే.. రాష్ట్ర రాజ‌కీయాలు ఏ మ‌లుపు తిరుగుతాయో చూడాలి.. ! 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu