Narendra Modi: తన ఫామ్‌హౌస్‌లో విలాసవంతంగా జీవిస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. పేదలకు మాత్రం గృహ వసతి కల్పించడం లేదని ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోడీ, పేదలకు సొంత ఇల్లు కోసం బీజేపీ హామీ ఇస్తుందని తెలిపారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరిదశకు చేరుకోవడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనాకత్వం తెలంగాణలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో పాలుపంచుకుంటున్నారు.
ప్రధాని మోడీ మెగా రోడ్ షో..
undefined
బీజేపీ తెలంగాణ యూనిట్ తన ప్రచారంలో భాగంగా నవంబర్ 27న (సోమవారం) ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే హైదరాబాద్ నగరం సహా దాని చుట్టుపక్కల 24 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 166 కిలో మీటర్ల పొడవైన భారీ రోడ్ షోకు సిద్ధమైంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నవంబర్ 27 ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. హైదరాబాద్, రాష్ట్రంలో కాషాయ పార్టీ అవకాశాలను పెంచడానికి రోడ్‌షో కవర్ చేయాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితాను పార్టీ విడుదల చేసింది.
ముషీరాబాద్‌లో ప్రారంభమయ్యే రోడ్‌షో సనత్‌నగర్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, సెర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్, గోషామహల్‌లో సాగనుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ల నుంచి నారాయణగూడ, వైఎంసీఏ కాచిగూడ జంక్షన్ల మీదుగా జరిగే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని కాచిగూడలోని వీర్ సావర్కర్ విగ్రహం వద్ద తన ప్రచారం ముగిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
రాష్ట్ర బీజేపీ చీఫ్ జీ. కిషన్ రెడ్డితో సహా తెలంగాణ కాషాయ పార్టీ నాయకులు, బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్ కె లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులు రోడ్‌షోలో ప్రధాని వెంట రానున్నారు. నగరంలోని రోడ్లపై ఈ భారీ ఎన్నికల రోడ్ షో కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే, ప్రధాని పర్యటన, ఎన్నికల ర్యాలీని దృష్టిలో వుంచుకుని తమ ప్రయాణ ప్రణాళికలు చేసుకోవాలని సంబంధిత వర్గాలు ప్రజలకు సూచించాయి. కాగా, రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.