
ఇటీవల జరిగిన సంఘటనలు చూస్తే ఈ చర్చలకు బలం చేకూరుస్తున్నాయి. రేవంత్ రెడ్డి సతీమణి గీత ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డికి స్వయంగా అన్న కూతురు. ఆమె పాలమూరు జిల్లాలోని మాడ్గులలో పుట్టారు. ఢిల్లీలో చదువు పూర్తి చేశారు. రేవంత్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె రాజకీయ అరంగేట్రంపై రేవంత్ రెడ్డి వైపునుంచి ఏరకమైన సంకేతాలు అందిన దాఖలాలు లేవు కానీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
వరంగల్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు రెండు రోజుల క్రితం చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క తో తాను మాట్లాడితే టిఆర్ఎస్ లో చేరేందుకు అంగీకరించారని, అయితే ఒకరాత్రిలోనే సీతక్కను ఏం చేశారో కానీ మనసు మార్చి కాంగ్రెస్ లో చేర్పించారని ఎర్రబెల్లి అన్నారు. రేవంత్ సతీమణి గీత సీతక్కను కలిసి కాళ్లు పట్టుకుని బతిలాడినట్లు ఎర్రబెల్లి ఆరోపించారు. అందేకే సీతక్క ఢిల్లీ ఫ్లైటెక్కి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.
ఎర్రబెల్లి మాటలపై సీతక్క నొచ్చుకున్నారు. నీచ రాజకీయాలు చేయకు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అది వేరే విషయం కానీ... ఎర్రబెల్లి వ్యాఖ్యల నేపథ్యంలో గీత రాజకీయ ప్రవేశం విషయం మరోసారి రేవంత్ అభిమానుల్లో కొత్త చర్చను లేవనెత్తింది. గీత కూడా రాజకీయ ప్రాభల్యం ఉన్న కుటుంబం నుంచే రావడం కూడా తెలిసిందే. కొందరు అభిమానులైతే.. ఆమె ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనేదాకా కూడా చర్చలు చేస్తున్నారు.
రేవంత్ సతీమణి రాజకీయ ప్రవేశం విషయమై రేవంత్ వర్గంలోని ఒక వ్యక్తి ఏషియా నెట్ తో మాట్లాడుతూ వందకు వంద శాతం ఆమె రాజకీయాల్లోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఇప్పటి వరకు రేవంత్ కుటుంబం నుంచి ఆ చర్చ ఏమాత్రం లేదని, ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయపరమైన కక్షతోనే ఆమె పేరును వివాదంలోకి తీసుకొచ్చిండు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లిన సందర్భంలోనే ఆయన కుటుంబసభ్యులు బయటకొచ్చి మాట్లాడలేదు. అలాంటిది ఆమె రాజకీయాల్లోకి వస్తారనే విషయం ఊహించడం కూడా సరికాదన్నారు.
మొత్తానికి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ సతీమణి గురించిన అంశాలు తెరమీదకు వచ్చాయి. అయితే ఈ అంశంపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.
మరిన్ని తాజా వార్తలతోపాటు, తెలంగాణ జర్నలిస్టులకు
కేసిఆర్ సర్కారు శుభవార్త వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి