కొడంగల్ గుర్నాథ్ రెడ్డి గురించి కేటిఆర్ ఏమన్నారంటే..?

First Published Nov 2, 2017, 9:09 AM IST
Highlights
  • రేవంత్ కు గతిలేదు అందుకే కాంగ్రెస్ లోకి పొయిండు
  • తెలంగాణ ఉద్యమ కాలంలో రేవంత్ సీమాంధ్ర వైపు ఉన్నడు

కాంగ్రెస్ పార్టీకి, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి అధికార టిఆర్ఎస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. కొడంగల్ నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ చేర్చుకుంది. తెలంగాణ భవన్ కు వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ గుర్నాథ్ రెడ్డి గురించి గతకాలపు పరిణామాలను లేవనెత్తి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ ను ఇరకాటంలోకి నెట్టేశారు. కేటిఆర్ ఏమన్నారో కింద చదవండి.

తెలంగాణ భవన్ లో వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలోని 1300 వందల మంది టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి లు కండువాలు కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు , ఎంపిపి, వైస్ ఎంపీపీ , సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్ లు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి , ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కండువా కప్పుకొని కుటుంబ పాలన అంతమొందిస్తామని రేవంత్ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేరికను స్కాం కాంగ్రెస్ లో ఇంకో దొంగ చేరిండు అంతవరకే చూస్తాము తప్ప ఇంకోటి కాదన్నారు. ఓటు కి నోటు లో దొరికిన దొంగని చేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ ఇంకా దిగజారిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో కలిసి రాకుండా రేవంత్ చంద్రబాబు వెంట ఉన్నాడని ఆరోపించారు. రాహూల్ గాంధీ కూడా కేసీఆర్ ను ఏం చేయలేకపోయిండన్నారు. రేవంత్ ఓట్లు వేసి గెలిపించిన కొండగల్ ప్రజల పరువు తీశాడన్నారు.

కొడంగల్ నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిండు గుర్నాథ్ రెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ? అంతటి ఘనత ఉన్న గుర్నాథ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఏం మేలు చేసిందో తెలుసా? ఐదుసార్లు గెలిచినా ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. గుర్నాథ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది.   

మహబూబ్ నగర్ వాసులు వలస కూలీలు గా మారడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు. మిషన్ కాకతీయ, ఫించన్లు , కళ్యాణ లక్ష్మి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి పల్లె నాది, ప్రతి గల్లీ నాది అని కేసిఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో గులాబీ దండయాత్ర కొడంగల్ నుండే ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. దొంగపని చేస్తే జైల్ లొనే పెడతారని రేవంత్ ను ఉద్దేశించి అన్నారు. రేవంత్ వి అన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలే బాస్ లు అని, వచ్చేసారి కూడా కేసిఆరే ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈ విషయం మోడీకి , సోనియాగాంధీ కూడా తెలుసన్నారు. అన్ని దర్వాజాలు బంద్ అయ్యాకే ఎక్కడ గతి లేక రేవంత్ కాంగ్రెస్ లో చేరిండని విమర్శించారు.  

సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. కొడంగల్ లో టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.

click me!