
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో క్రియాశీలకంగా సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ స్ట్రీట్ కాజ్(Street Cause)కు చెందిన ఒక విభాగం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ(Hyderabad Youth Assembly) సదస్సు ఈ నెల 21న నిర్వహించనున్నారు. అంబేద్కర్ కాలనీలోని జీపీ బిర్లా సెంటర్(GP Birla Centre)లో ఈ సమావేశం జరగనుంది. ఈ అసెంబ్లీకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud), భారత జాతీయ బ్యాడ్మింటన్ టీమ్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లు రానున్నారు. ఈ కార్యక్రమం 21వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జరగనుంది. ఇది హైదరాబాద్ యూత్ అసెంబ్లీ 11వ సెషన్ కానుంది.
Also Read: మెడికల్ క్యాంప్ నిర్వహించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు
జంట నగరాల్లో స్ట్రీట్ కాజ్‌కు మంచి పేరుంది. సమాజంలో మార్పు కోసం అనేక సేవా కార్యక్రమాలను ఈ ఎన్‌జీవో చేపడుతున్నది. 2010లో బెస్ట్ యూత్ ఆర్గనైజేషన్ అవార్డునూ స్ట్రీట్ కాజ్ గెలుచుకుంది. డెలాయిట్, గోల్డ్ డ్రాప్ ఇండస్ట్రీస్, ఇండియన్ రెడ్ క్రాస్ సహా పలు సంస్థలతో కలిసి సంయుక్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటి వరకు ఎనిమిది వేల పైచిలుకు కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహించింది. స్ట్రీట్ కాజ్‌కు చెందిన విభాగం హైదరాబాద్ యూత్ అసెంబ్లీ తొమ్మిదేళ్లుగా నగరంలో యువతను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నదని, వారిలో నైపుణ్యాలు పెంచుతూ సమాజానికి ఉపకారం చేయడానికి ప్రయత్నిస్తున్నదని స్ట్రీట్ కాజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.