Farm Laws: కేసీఆర్ రంగంలోకి దిగాడు.. కేంద్రం సాగు చట్టాలు రద్దు చేసింది: మంత్రి తలసాని

By telugu teamFirst Published Nov 19, 2021, 6:26 PM IST
Highlights

ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ మహా ధర్నా చేపట్టగానే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ధర్నాలో పాల్గొనడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారని, ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేసే నిర్ణయం తీసుకుందని తెలిపారు.
 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాల(Farm Laws)ను ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన ప్రకటనను రాష్ట్ర పశుసంవర్దక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav)స్వాగతించారు. సీఎం కేసీఆర్ (KCR) రైతులకు అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మహా ధర్నా(Maha Dharna)కు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచి మహా ధర్నా నిర్వహించడంతో కేంద్రం దిగివచ్చిందని, సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి తలసాని చెప్పారు. ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చి పాల్గొన్నారని తెలిపారు. ఈ ఆందోళన ఉధృతమవుతుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలను ఉపసంహరించుకుందని వివరించారు. గత కొన్ని నెలలుగా రైతులు అనేక పోరాటాలు చేపడుతున్నారని, ఎంతో మంది రైతులు  (Farmers) మరణించారని పేర్కొన్నారు. 

Also Read: Farm Laws: రైతుల పక్షాన కేసీఆర్ గర్జించడంతో కేంద్రం దిగివచ్చింది: మంత్రి సత్యవతి రాథోడ్

రైతే రాజు అనే నినాదాన్ని నెరవేర్చాలని 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తూ తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నదని మంత్రి తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్, రైతులు పండించిన ధాన్యం, కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్టు తిడతామంటే ఊరుకోబోమని, తాము ప్రధాన మంత్రినీ తిట్టలేమా? అంటూ మంత్రి తలసాని ప్రశ్నించారు. కానీ, తమకు సంస్కారం ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్‌రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, హన్మంతరావు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Also Read: వ్యవసాయ చట్టాల రద్దుపై స్పందించిన కేటీఆర్... ‘పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’..

రైతుల(Farmers) పక్షాన పోరాటానికి నాయకత్వం వహిస్తానని Telangana ముఖ్యమంత్రి KCR ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చట్టాలను రద్దు చేశారని భావిస్తున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. 40ఏళ్ల అనుభవం కలిగి దీటైన నాయకత్వం వహించే కేసీఆర్ వంటి నేతలు దేశంలో మరెక్కడా లేరని వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వమే ఆలోచించి ఉంటుందని, ఇంకా రోడ్డున పడటం కంటే ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే మంచిదని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని వివరించారు.

click me!