
తెలంగాణ అసెంబ్లీ దేశంలోనే ఓ అరుదైన ఘనతను సాధించింది. దేశంలో చాలా అసెంబ్లీలకు సొంత వెబ్ సైట్లు కూడా లేవు. కానీ, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మాత్రం అప్పుడే వెబ్ సైట్ ను రూపొందించడంతో పాటు మూడు భాషల్లో వెబ్ సైట్ రూపొంది కొత్త రికార్డు సృష్టించింది.
దేశంలో ఈ ఘనత సాధించిన తొలి శాసనసభగా మన అసెంబ్లీ రికార్డును సొంతం చేసుకోబోతున్నది.
శాసనసభ సచివాలయం నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు, రోజువారీ అజెండా తదితర అంశాలతో డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ తెలంగాణ లేజిస్లేచర్ డాట్ ఓఆర్‌జీ డాట్ ఇన్ అనే చిరునామాతో ఇప్పటికే టీఎస్‌ఎల్‌ఎస్ అధికారిక వెబ్‌సైట్ ఇంగ్లీష్‌లో ఉంది. దీనికి అదనంగా ఇప్పుడు తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా వెబ్‌సైట్ ను తీసుకొచ్చారు. దీన్ని అధికారికంగా ఈ నెల 6న ప్రారంభించనున్నారు.
వెబ్‌సైట్‌పై లాంగ్వేజ్ అనే ఆప్షన్‌లో తెలుగు, ఉర్దూ వర్షన్లు అందుబాటులో ఉంటాయి. ఏ భాషలో వెబ్‌సైట్‌ను చూడదలచుకుంటే ఆ భాషపై క్లిక్ చేస్తే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.
అసెంబ్లీ వెబ్‌సైట్‌లో శాసనమండలి, శాసనసభ సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చే అంశాలు, సభ్యులకు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల సమాచారం పొందుపర్చనున్నారు.
అలాగే మెయిల్ యువర్ మెంబర్ అనే ఆప్షన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు తమ సమస్యలు, ఇతర అంశాలపై ప్రజలు ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉంది.
ఈ నెల 6న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ సీహెచ్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పాల్గొననున్నారు.