కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో అస్త్రంగా ఉపయోగపడిన ఆరు గ్యారంటీలు లోక్ సభ ఎన్నికల్లో మాత్రం పార్టీకే అగ్నిపరీక్ష పెట్టేలా ఉన్నాయని చర్చిస్తున్నారు. ఆరు గ్యారంటీలపై విమర్శలు రాకుండా.. ప్రజలను ఆకట్టుకునేలా అమలు చేస్తేనే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉండనుంది. కానీ, ఇప్పటికే అమలవుతున్న గ్యారంటీలు, దరఖాస్తుల స్వీకరణ, విపక్షాల విమర్శలు చూస్తే మాత్రం కాంగ్రెస్‌కు అగ్నిపరీక్ష ఎదురుకానుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.
Lok Sabha Elections: అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో నేతలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు. సొంత పార్టీనా? ప్రత్యర్థి పార్టీనా? అనే పట్టింపు వారికి ఉండదు. కానీ, తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సారథ్యంలో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను చూరగొనే ప్రయత్నం చేస్తూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పైనా దాడికి దిగుతున్నారు. ఈ స్వల్ప కాలంలోనే బెస్ట్ రూలింగ్ అనే అభిప్రాయం ప్రజల్లో తెచ్చుకుని.. ఆ అభిప్రాయాన్ని లోక్ సభ ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ ఉబలాటపడుతున్నది.
కర్ణాటకలోనైనా, తెలంగాణలోనైనా ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగానే ఉపయోగించుకుంది. అధికారాన్ని చేపట్టింది. జనాకర్షక హామీలతో జనరంజక పాలన అందిస్తామని కాంగ్రెస్ చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొట్టతొలిగా మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకు ఏ హామీని పూర్తి స్థాయిలో అమల్లోకి తేలేదు. ఇంతలోనే ప్రజా పాలన పేరిట దరఖాస్తులను స్వీకరిస్తున్నది.
undefined
దీంతో బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు తెరలేపింది. ఎప్పుడు అమలు చేస్తామనే ప్రకటనే లేకుండా.. కనీసం గైడ్‌లైన్స్ కూడా రూపొందించకుండా దరఖాస్తులు స్వీకరించడం కాలయాపనేనని ఆరోపించింది. ఈ దరఖాస్తుల ప్రక్రియను లోక్ సభ ఎన్నికల వరకు లాగి.. కోడ్ పేరిట హామీల అమలును వాయిదా వేసేలా ఉన్నదని అనుమానాలు వ్యక్తం చేసింది.
Also Read: New Year: 2024 లీపు సంవత్సరమేనా? లీప్ డే అంటే ఏమిటీ? ఎందుకు?
ఇప్పటికే ఖజానాలో ఏమీ లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా కిందా ఇంకా రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించాలనే వాదనలు వినిపించాయి. దీంతో ఆరు గ్యారంటీలను లోక్ సభ ఎన్నికల లోపే అమలు చేయడం కాంగ్రెస్‌కు సాధ్యపడుతుందా? అనే సంశయాలు నెలకొంటున్నాయి. దీనికితోడు ఇప్పుడు కాంగ్రెస్ పై అక్కడక్కడ విమర్శలు వస్తున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు అమలుపై కొంత వ్యతిరేకత వచ్చింది. రైతు భరోసా విషయంలో ఇప్పటికీ చాలా మంది రైతుల్లో అసహనం నెలకొని ఉన్నది. సమీప భవిష్యత్‌లోరాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు హామీల అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారనే చర్చ మొదలైంది. అదే జరిగితే తీవ్ర వ్యతిరేకత రావడం తథ్యం. నిధుల కొరతే ప్రధాన కారణంగా ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించే రామ విగ్రహం ఎవరు చెక్కారు? ఎలా ఉన్నది?
లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే రైతు భరోసా సాయం పడుతుందా? లేదా? అనే చర్చ జరుగుతుంది. దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందా? లేక ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతుందా? అనే దానిపైనా ఆసక్తి నెలకొంది. దీనిపై క్లారిటీ వస్తే.. ప్రభుత్వంపై దాడి చేయడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడితే మాత్రం దునుమాడాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. మెజార్టీ లోక్ సభ స్థానాలు గెలుచుకునే బీఆర్ఎస్ పట్టు అలాగే ఉన్నదని వాదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. పదికి పైగా స్థానాలు గెలువాలని బీజేపీ టార్గెట్ ఫిక్స్ చేసింది.
Also Read : Free Bus: ఏపీ ఎన్నికల పై ‘ మహిళలకు ఉచిత ప్రయాణం ’ ప్రభావం ఎంత ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల కూడా పూర్తి కాలేదని, ఇప్పుడే విమర్శలు చేయడం తగదని, కొందరంటే.. లోక్ సభ ఎన్నికలకూ ఎక్కువ సమయమేమీ లేదనీ మరికొందరు వాదనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అస్త్రంగా ఉపయోగపడిన ఆరు గ్యారంటీలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష పెట్టనున్నాయని చర్చిస్తున్నారు.