వనపర్తి చిన్నన్నకు రేవంతే పెద్ద దిక్కా ?

First Published Mar 3, 2018, 3:35 PM IST
Highlights
  • రేపు వనపర్తిలో సింహగర్జన సభ
  • కేవలం రేవంత్ ఒక్కడినే చీఫ్ గెస్ట్ గా పిలిచిన చిన్నారెడ్డి
  • కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్
  • ఒక్క దెబ్బకు రెండు పిట్టల స్కెచ్ ఉందంటున్న చిన్నన్న సన్నిహితులు

 

తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుల జాబితాలో పాలమూరు జిల్లా నేత వనపర్తి ఎమ్మెల్యే జిల్లెల చిన్నారెడ్డి ముందు వరుసలో ఉంటారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుల జాబితాలో టాప్ లో ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో చిన్నారెడ్డి పాత్ర మరువలేనిది. ప్రజల కోసమే రాజకీయం చేయడం చిన్నారెడ్డి నైజం. అటువంటి చిన్నారెడ్డి తాజాగా చేపట్టిన ఒక కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అది కూడా రేవంత్ విషయంలో కావడం హాట్ టాపిక్ అయింది. ఇంతకూ ఆ సబ్జెక్టు ఏందనుకుంటున్నారా? చదవండి. స్టోరీ మొత్తం.

ఆదివారం వనపర్తి పట్టణంలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు సింహ గర్జన సభ జరుపుతున్నారు. ఈ సభకు కర్త, కర్మ, క్రియ అన్నీ చిన్నారెడ్డే. కానీ షాకింగ్ ట్విస్ట్ ఏందంటే.. ఈ సింహగర్జన సభకు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. సింహగర్జన సభకు సంబంధించిన పోస్టర్లలో, కర పత్రాల్లో చిన్నారెడ్డితోపాటు రేవంత్ రెడ్డి ఫొటోను కూడా ముద్రించారు. వీరిద్దరితోపాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు మాత్రమే ముద్రించారు. ఈ సింహగర్జన సభ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ ఎంతో చిన్నవాడైన రేవంత్ రెడ్డిని చిన్నారెడ్డి సింహగర్జన సభకు ముఖ్య అతిథిగా పిలవడం ఏందబ్బా అని కాంగ్రెస్ నేతలు బుర్ర గోక్కుంటున్నారు. ఏ పిసిసి అధ్యక్షుడినో పిలిచి సభ పెట్టుకుంటారు. లేదంటే పిసిసి ఇన్ఛార్జి ని పిలుస్తారు. లేదంటే ఏఐసిసి పెద్ద లీడర్లను పిలుచుకుంటారు. కానీ చిన్నారెడ్డి మాత్రం మరీ చిన్నవాడైన రేవంత్ ను ఒక్కడినే పిలిచి మీటింగ్ పెట్టిండంటే మతలబేందబ్బా అని వనపర్తి రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణలోనే పెద్ద లీడర్ గా ఎదిగిన చిన్నారెడ్డి అంత చిన్న లీడర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచారంటే.. చిన్నారెడ్డి లాంటి డైనమిక్ లీడర్లే రేవంత్ ను రాష్ట్ర లీడర్ గా గుర్తించినట్లే అని చిన్నారెడ్డి సన్నిహితుడు ఒకరు ఏషియానెట్ కు తెలిపారు.

అయితే రేవంత్ ను పిలవడంలో ఇంకో మర్మం కూడా ఉందని తెలుస్తోంది. అదేమంటే.. రేవంత్ రెడ్డి తన విద్యార్థి దశలో ఎక్కువ కాలం వనపర్తిలో చదివినట్లు చెబుతున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాలంలో కూడా రేవంత్ కు వనపర్తిలో పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రేపటి సభకు పెద్ద పెద్ద లీడర్లను, కొమ్ములు తిరిగిన నాయకులను, కాకలు తీరిన యోధులను పక్కన పెట్టి కేవలం రేవంత్ తోటే సభ ఖతం చేయాలని చిన్నారెడ్డి భావించారని చెబుతున్నారు. రేపటి సభలో టిడిపిలో తనకు ఉన్న ఆప్తులందరినీ రేవంత్ చిన్నారెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ లో చేర్పించుకుంటారని విశ్వసనీయంగా తెలిసింది. రేవంత్ కు వనపర్తిలో ఉన్న బలగాన్ని అంతా కాంగ్రెస్ లో చేర్చడం ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు సీన్ క్రియేట్ చేయాలని చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అదేమంటే టిడిపి కేడర్ అంతా కాంగ్రెస్ లో చేరితే చిన్నారెడ్డి వనపర్తిలో స్ట్రాంగ్ అవుతారు. అలాగే రెండో ముచ్చటేందంటే..? కేడర్ వెళ్లిపోయిన తర్వాత చిన్నారెడ్డి ప్రధాన ప్రత్యర్థి, చిరకాల ప్రత్యర్థి అయిన టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి జల్దీ వచ్చి కాంగ్రెస్ లో చేరతారన్నది ప్లాన్ గా చెబుతున్నారు. కేడర్ లేకుండా రావులను తొందరగా కాంగ్రెస్ లో చేర్పించడం కోసమే ఈ సభకు చిన్నన్న రేవంత్ ను పిలిచారు అని స్థానిక నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఇప్పటికే టిడిపి రావుల కాంగ్రెస్ లోకి రావాలని తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు చిన్నారెడ్డి ప్రకటించారు. రావులకు అవసరమైతే తన సీటు కూడా ఇస్తానన్నారు. లేదంటే దేవరకద్రలో రావుల పోటీ చేయాలని సూచించారు. దేవరకద్రలో ప్రస్తుతం ఉన్న పవన్ కుమార్ రెడ్డి కంటే రావుల బలమైన అభ్యర్థి అవుతాడని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే చిన్నలీడర్ అయినప్పటికీ చిన్నారెడ్డి స్కెచ్ వేసి మరీ రేవంత్ ను పిలిచి సభ పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి సింహగర్జన సభ ఎట్ల జరుగుతుందో పాలమూరు రాజకీయాలను ఏరకంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాలి.

click me!