Secunderabad Club మూసివేత.. ఆ డేటా సురక్షితం.. వెల్లడించిన క్లబ్ యాజమాన్యం

By Sumanth KanukulaFirst Published Jan 17, 2022, 12:37 PM IST
Highlights

అగ్నిప్రమాదం నేపథ్యంలో.. సికింద్రాబాద్ క్లబ్‌ను (Secunderabad Club) మూసివేస్తున్నట్టుగా యాజమాన్యం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. 

సికింద్రాబాద్ క్లబ్‌ మూతపడింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో.. సికింద్రాబాద్ క్లబ్‌ను (Secunderabad Club) మూసివేస్తున్నట్టుగా యాజమాన్యం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అగ్నిప్రమాదంతో చాలావరకు నష్టపోయామని వెల్లడిచింది. క్లబ్ సభ్యులకు సంబంధించి డేటా సురక్షితంగా ఉందని పేర్కొంది. క్లబ్‌లోని కొల్నాడబార్, బిలియర్డ్స్ రూమ్, బాల్ రూమ్, మెయిర్ రిసెప్షన్ నుంచి ఫస్ట్‌ఫ్లోర్‌కు వెళ్లే చెక్కమొట్లు దగ్దమయ్యానని ప్రకటించింది. మెయిన్ హాల్ పూర్తిగా అగ్నికి అహుతైందని తెలిపింది. క్లబ్‌కు భారీగా ఆస్తి నష్టం వాటిలినట్టుగా తెలిపింది. 

ఇక, ఆదివారం తెల్లవారుజామున చారిత్రక సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంటీరియర్‌, ఫర్నిచర్‌, మద్యం, ఇతర సామగ్రి.. ఇలా మొత్తం బుగ్గిపాలైంది. నిర్మాణంలో ఎక్కువ భాగం చెక్కతోనే నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దాదాపు 20 కోట్ల రూపాయల నష్టం చేకూరినట్టుగా క్లబ్ నిర్వాహకులు చెప్పారు. సంక్రాంతి సెలవు దినం కావడంతో.. క్లబ్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వచ్చాయని.. కొద్దిసేపటికే భవనంలో మంటలు చెలరేగాయని అక్కడి సిబ్బంది తెలిపారు. 

తెల్లవారుజామున ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మొదట అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లేందుకు లోపలి భాగంలో ఉన్న చెక్క మెట్లు దగ్దం కావడంతో మంటలను అదుపులోకి తేవడానికి ఎక్కువ శ్రమించాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 

1878లో బ్రిటీష్‌ హయాంలో మిలటరీ అధికారులు కోసం ఈ క్లబ్‌ నిర్మించారు. 22 ఎకరాలకు పైగా విస్తీరణంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ విస్తరించి ఉంది. దీనిని సికింద్రాబాద్ గ్యారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటైడ్ క్లబ్.. వంటి పేర్లతో పలిచేవారు. 1947 వరకు ఇందులో బ్రిటీష్ అధికారులు, నవాబులుకు మాత్రమే ఇందులో సభ్యత్వం ఉండేవి. ప్రస్తుతం ఆర్మీ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు, పోలీసు అధికారులు.. పలు రంగాలకు చెందిన అధికారులు శాశ్వత, క్రియాశీలక సభ్యత్వం ఉంది. 

హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ క్లబ్‌కు వారసత్వ హోదా ఇచ్చింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు. ఈ క్లబ్‌లో 5 వేల మందికి సభ్యత్వం ఉండగా.. 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 

click me!