పీసీసీ చీఫ్ కాకుంటే.. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా పర్లేదు: జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 13, 2021, 10:19 PM IST
Highlights

పీసీసీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని పేర్కొన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని ప్రకటించారు. 

టీపీసీసీ చీఫ్‌ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించడంతో తెలంగాణ  హస్తం నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఎవరికి తోచిన విధంగా హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేస్తూ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తాజాగా పీసీసీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని పేర్కొన్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతానని ప్రకటించారు. సోనియా, రాహుల్‌ గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని తెలిపారు. వీహెచ్‌ చాలా సీనియర్.. వారి ఆవేదన వారిదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు పీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి లేఖ రాశానని ఆయన స్పష్టం  చేశారు. పీసీసీ ఇవ్వకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని జగ్గారెడ్డి కోరారు. 

మరోవైపు తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సహా ఐదారుగురు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. అటు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుటుంబాలు, అనుచరులతో కలిసి ఆశావహులు ఢిల్లీ వెళ్లారు.

Also Read:తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తిన టూర్: టీపీసీసీకి కొత్త బాస్‌ ఎంపిక తేలేనా?

అంతకుముందు సీనియర్ నేత  వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ... పార్టీలో మొదటి నుండి ఉన్న విశ్వాసపాత్రులకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్నారు. కర్ణాటకలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం పరిశీలకుడిని పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు పంజాబ్ లో కూడ అదే జరుగుతోందన్నారు.  తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఎందుకు పరిశీలకుడిని పంపడం లేదని ఆయన ప్రశ్నించారు.

తనను పార్టీ నుండి పంపేందుకు పొగబెడుతున్నారని ఆయన ఆరోపించారు.  టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి దక్కకుండా అడ్డుకొనేందుకు వి. హనుంతరావు చివరి వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే  పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఢిల్లీ టూర్‌  పార్టీలో చర్చ సాగుతోంది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకొందనే నేపథ్యంలో  పార్టీ నేతలు ఢిల్లీ టూర్ చేపట్టారనే ప్రచారం కూడ నెలకొంది. 

click me!