తనను కలవడానికి వచ్చిన వ్యక్తి నడవలేని స్థితిలోవుండటం చూసి చలించిపోయిన రాచకొండ సిపి తన చాంబర్ నుండి బయటకు వచ్చి అతడినుండి ఫిర్యాదు స్వీకరించారు.
హైదరాబాద్ : ఈ కలికాలంలో మానవ సంబంధాలకు విలువే లేకుండా పోయింది. భార్యభర్తలు, తల్లీబిడ్డలు, అన్నాదమ్ములు, అక్కాచెల్లెలు... ఏబంధమైనా ఆర్థిక బంధం తర్వాతే. తమకు ఏ అవసరం లేదనుకుంటే ఈజీగా బంధాలను తెంపుకుని దూరమవుతున్న అనేక ఘటనలు చూస్తున్నాం. ఇలా ఓ వ్యక్తి పక్షవాతంతో మంచాన పడి భారంగా మారడంతో భార్యతో సహా కుటుంబసభ్యులంతా వదిలేసారు. బాగున్నపుడు ప్రేమను కురిపించిన కుటుంబం... కష్టాల్లో మాత్రం ఒంటరిగా వదిలివెళ్లడంతో అతడు రోడ్డునపడ్డాడు.దీంతో ఏదిక్కూ లేని తనకు సాయం చేయాలంటూ బాధితుడు హైదరాబాద్ కమీషనర్ ను కలిసి వేడుకున్నాడు.
బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ గ్రామానికి చెందిన కిషన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రోజూ ఆటో నడపడం ద్వారా వచ్చిన డబ్బులను కుటుంబ అవసరాలకు వాడేవాడు. దీంతో అతడు ఒక్క రూపాయి కూడా వెనకేయలేకపోయాడు. అయితే నాలుగేళ్ల క్రితం అతడు పక్షవాతానికి గురయి మంచానపడటంతో పరిస్థితి తలకిందులయ్యింది.
undefined
ఆటో డ్రైవర్ గా పనిచేసే సమయంలో ప్రేమగా చూసుకునే కుటుంబం మంచాన పడగానే ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందోనని మాట్లాడటం మానేసారు. చివరకు కట్టుకున్న భార్య కూడా అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా మారిన అతడు నానాఅవస్థలు పడుతున్నాడు. దీంతో తనకు సాయం చేయాలంటూ కిషన్ పోలీసులను ఆశ్రయించాడు.
Read More అదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై సామూహిక అత్యాచారం, హత్య..
బాధితుడు కిషన్ నడవలేని పరిస్థితిలో కూడా ఎంతో కష్టపడి రాచకొండ పోలీస్ కమీషనర్ కార్యాలయానికి చేరుకున్నాడు. సిపి డీఎస్ చౌహాన్ కలిసి తన బాధను చెప్పుకోవాలని భావించాడు.కానీ అతడి పరిస్థితి గురించి తెలుసుకున్న సిపి తన చాంబర్ నుండి బయటకు వచ్చి కలిసాడు. బాధితుడి నుండి ఫిర్యాదు తీసుకుని ఈ పరిస్థితిలో ఎంతలా బాధపడుతున్నాడో విని చలించిపోయారు. వెంటనే కిషన్ కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాగా చూసుకునేలా చూడాలని సంస్థాన్ నారాయణపూర్ పోలీసులకు సిపి చౌహాన్ సూచించారు.
అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా నడవలేని పరిస్థితిలో వున్న బాధితుడి వద్దకే వెళ్ళి ఫిర్యాదు స్వీకరించిన సిపి చౌహాన్ పై ప్రజలు ప్రశంసలు కురిస్తున్నారు. ఇది కదా ప్రెండ్లీ పోలీసింగ్... ఇది కదా పోలీసులు బాధితులకు భరోసా ఇచ్చే విధానం అంటూ రాచకొండ సిపి చేసిన పనిని అభినందిస్తున్నారు.