తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు.
హైదరాబాద్: రబ్బరు స్టాంప్ గవర్నర్లు బీఆర్ఎస్ కు నచ్చుతారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. గురువారంనాడు హైద్రాబాద్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.గవర్నర్ ను అవమానించడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.గవర్నర్ ను హేళన చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు.
బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు.సీఎం అందుబాటులో లేరనే రాజ్ భవన్ వైపు ప్రజలు చూస్తున్నారని బండి సంజయ్ చెప్పారు.హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రి విషయమై వాగ్ధానాన్ని నెరవేర్చాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా నిన్న స్పందించారు. తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
also read:బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడొద్దు: ఉస్మానియాపై తమిళిసైకి హరీష్ కౌంటర్
బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ వైద్య శాఖలో అభివృద్ధి గవర్నర్ కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. చెడు మాత్రమే గవర్నర్ బూతద్దంలో చూస్తున్నారన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మాణానికి కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో కొత్త భవనం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని హరీష్ రావు గుర్తు చేశారు.