సాత్విక్ ఆత్మహత్య కేసు .. పోలీసుల అదుపులో నలుగురు, సూసైడ్ నోట్‌ ఆధారంగా అరెస్ట్‌లు

By Siva Kodati  |  First Published Mar 3, 2023, 5:31 PM IST

హైదరాబాద్ శివారు నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్ నరకం చూపిస్తున్నారని సాత్విక్ సూసైడ్ నోట్‌లో రాశాడు. 
 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. తన మరణానికి కారణమంటూ సాత్విక్ సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరు నలుగురిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. వారి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. వారిని వదలొద్దని సాత్విక్ సూసైడ్ నోట్‌లో కోరాడు.

అంతకుముందు గురువారం సాత్విక్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా విచారణ చేపట్టింది. డీఈవో ఆధ్వర్యంలో అధికారులు నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌ను  సందర్శించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా అధికారులు సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ చైతన్య యాజమాన్యానికి ఇంటర్ బోర్డు నోటీసులు జారీచేసింది. దీనిపై శ్రీ చైతన్య యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు రిపోర్టును సిద్దం చేసి ఇంటర్ బోర్డు కమిషనర్‌కు అందజేయనున్నారు. 

Latest Videos

ALso REad: శ్రీచైతన్య కాలేజీలో కోమటిరెడ్డి బైఠాయింపు:సాత్విక్ మృతికి కారకులపై చర్యలకు డిమాండ్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజప్రసాద్, అలివేలు దంపతు చిన్న కుమారుడు సాత్విక్.. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం కాలేజ్ హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి.. కాలేజ్ లెక్చరర్లు వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని లెక్చరర్లు వేధించినట్టుగా  సాత్విక్ తమతో చెప్పుకుని బాధపడినట్టుగా అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

Also REad: సాత్విక్ కేసు: ఇంటర్ బోర్డు, సబితా ఇంటి వద్ద విద్యార్ధి సంఘాల ధర్నా

ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సాత్విక్ రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, అడ్మిన్ ఆచార్య, వార్డెన్ నరేష్‌, టీచర్ శోభన్ నరకం చూపిస్తున్నారని అందులో రాసి ఉంది. వారి టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సాత్విక్ తెలిపాడు. తన ఆత్మహత్యకు కారకులైన వారిపై యాక్షన్‌ తీసుకోవాలని కోరాడు. అమ్మ, నాన్న, అన్నయ్య ఈ పని చేస్తున్నందుకు క్షమించండని పేర్కొన్నాడు. ఇక, ఈ ఘటనపై సాత్విక్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి కొందరిని  అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించింది. 
 

click me!