రాష్ట్రప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య గ్యాప్ లేదని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి చెప్పారు. గవర్నర్ తీరును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారంనాడు కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కు వెళ్లిన అంశంపై మీడియా ప్రశ్నలపై ఆయన స్పందించారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతికుమారి రాజ్ భవన్ కు రాని విషయాన్ని గవర్నర్ ట్వీట్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. అదికారులను పిలిపించి మాట్లాడే హక్కు గవర్నర్ కు ఉందన్నారు.
సెక్షన్ 8 ప్రకారంగా హైద్రాబాద్ గవర్నర్ పరిధిలో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అధికారులను పిలిచి సమీక్ష నిర్వహించే అధికారం గవర్నర్ కు ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. సమీక్షలు నిర్వహించిన సమయంలో సమీక్షలకు రాని అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం కూడా గవర్నర్ కు ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు తాను నిర్వహించిన సమీక్షలకు రాకపోతే వారిపై డీఓపీటీకి ఫిర్యాదు చేయవచ్చని రేవంత్ రెడ్డి చెప్పారు. సెక్షన్ 8 గురించి తెలియకపోతే తమకు సమయం ఇస్తే ఈ విషయమై గవర్నర్ కు వివరించేందుకు సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకొనే రోజున గవర్నర్, ప్రభుత్వం ఒక్కటౌతున్నారని చెప్పారు. మిగిలిన రోజుల్లో డ్రామా రక్తి కట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అవగాహనతోనే రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
also read:తమిళిసైపై కేసీఆర్ సర్కార్ పిటిషన్: హోలీ సెలవుల తర్వాత విచారించనున్న సుప్రీం
పాదయాత్రలు ఎవరూ చేసిన తప్పు లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలు హత్ సే హత్ జోడో పరిధిలోకి వస్తాయన్నారు. అందరూ పాదయాత్రలు చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి చెప్పారు. పాదయాత్రలు చేయకపోతే పార్టీ నేతలపై చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు.