హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసును అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు ఎవరెవరు సహయం చేశారనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. హైద్రాబాద్ పేలుళ్లకు కుట్ర పన్నిన నిందితులకు ఆర్ధిక సహయం చేసిన కలీం అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం నాడు హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు.
2022 డిసెంబర్ మాసంలో జాహెద్ , సమీదుద్దీన్, మాజా హసన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ లో పేలుళ్లకు ఈ ముగ్గురు కుట్ర పన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తుంది. ఈ నెల 5వ తేదీనే ఎన్ఐఏ అధికారులకు ఈ కేసును బదిలీ చేశారు.
గత ఏడాది దసరా సమయంలో హైద్రాబాద్ నగరంలో పేలుళ్లకు పాల్పడాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. హైద్రాబాద్ లో జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడాలని ఈ ముఠా కుట్రకు పాల్పడింది. అంతేకాదు దసరా ఉత్సవాల సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను హత్య చేయాలని ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు. పేలుళ్లకు అవసరమైన గ్రైనేడ్లు, ఇతర మందు గుండు సామాగ్రిని జాహెద్ సమకూర్చుకున్నారు.
హైద్రాబాద్ పేలుళ్ల కుట్రకు ప్లాన్ చేసిన జాహెద్ గ్యాంగ్‌కి పాతబస్తీకి చెందిన కలీం ఆర్ధిక సహయం చేసిన విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇవాళ కలీంను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన కలీం ఇచ్చిన ఆర్ధిక సహయంతో రెండు మోటార్ బైక్ లను జాహెద్ కొనుగోలు చేశారు.. ఈ బైక్ ల్లో పేలుడు పదార్ధాలు అమర్చి పేల్చి వేయాలని ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. నిందితులకు ఆర్ధిక సహయం చేసిన కలీంకి ఈ డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు అధికారులు విచారణ చేస్తున్నారు.
also read:హైద్రాబాద్ పేలుళ్ల కుట్ర కేసు:ఎన్ఐఏ కి బదిలీ
హైద్రాబాద్ నగరంలో మూడు చోట్ల పేలుళ్లకు పాల్పడాలని నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ విషయాన్ని ముగ్గురు నిందితుల రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో హోంగార్డు మృతి చెందాడు. అయితే ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తికి జాహెద్ ఆశ్రయం కల్పించారు. ఈ కేసులో జాహెద్ జైలు జీవితం గడిపి విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడ అతనిలో మార్పు రాలేదని పోలీసులు చెబుతున్నారు.