
Union Minister for Culture and Tourism G Kishan Reddy: దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడుల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మరో రాజకీయ రచ్చ మొదలైంది. ప్రజా గొంతుకను వినిపిస్తూ.. ప్రధాని మోడీ సర్కారును విమర్శించే వారితో పాటు మీడియా సంస్థలపైకి బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు సైతం ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీబీసీ కార్యాలయాలపై దాడులను ప్రస్తావిస్తూ.. బీఆర్ఎస్ నాయకులు బీజేపీపై, ఆ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. పత్రిక స్వేచ్ఛపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి మరోసారి బీఆర్‌ఎస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి పత్రికా స్వేచ్ఛపై బీజేపీకి పాఠాలు నేర్చుకోవాల్సిన గతిపట్టలేదని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బీఆర్ఎస్ నుంచి పాఠాలు నేర్చుకునే గతిపట్టలేదు..
కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి.. బీబీసీ అంశం మధ్య బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీకి బీఆర్ఎస్ నుంచి పాఠాలు నేర్చుకునే గతిపట్టలేదని అన్నారు. వివిధ మీడియా సంస్థలను నిషేధిస్తామంటూ బెదిరించింది కల్వకుంట్ల కుటుంబమేనని ఆరోపించిన ఆయన.. వారిపై వచ్చిన మీడియా కథనాలను గురించి ప్రస్తావించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పత్రికా స్వేచ్ఛ నైతికతపై బీజేపీకి బీఆర్ఎస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
బీబీసీపై ఇన్‌కమ్ ట్యాక్స్ రైడ్ చేసినందుకు మీడియాపై దాడికి పాల్పడ్డారంటూ కేంద్రంపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలపై ఆయన స్పందిస్తూ.. పత్రికా స్వేచ్ఛను, మీడియాతో వ్యవహరిస్తున్న కల్వకుంట్ల కుటుంబం గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు. అంతా ప్రజలు చూస్తున్నారని కూడా పేర్కొన్నారు. మీడియాను ఒక కిలో మీటర్ లోతున పాతిపెట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు ఇదివరకు చేసిన ప్రకటనను కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మీడియాపైనా, పత్రికా స్వేచ్ఛపైనా కేంద్రం ఎక్కడా దాడి చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం బీఆర్ఎస్ పనితీరు శైలి అని విమర్శించారు. కలవకుంట్ల కుటుంబం సొంత ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చిందని విమర్శిస్తూ.. వారు పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి అన్నారు.