
Hyderabad: తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే ఎన్నికల ప్రణాళికలు రచిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో దూకుడుగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎలాగైనా ఈ సారి రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్ర నాయకత్వం తెలంగాణ పర్యటనలకు చేస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు తెలంగాణ పర్యటనకు వచ్చారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌కు వెళ్లి రాష్ట్రంలోని బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ మే 26న తెలంగాణకు చేరుకుని హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అయితే, కార్యక్రమానికి వెళ్లే ముందు ప్రధాని మోడీ విమానాశ్రయంలో బీజేపీ నేతలతో సమావేశమవుతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను కూడా ప్రధాని మోడీ విమానాశ్రయం నుంచే వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్‌గా హాజరవుతారు. ‘‘గత 20 రోజుల్లో ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వచ్చారు, ఇప్పుడు ప్రధాని కూడా వస్తున్నారు. ఇది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ నైతిక స్థైర్యాన్ని మరింతగా పెంపొందిస్తుంది’’ అని బీజేపీ నేత ఒకరు తెలిపారు.
ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర బీజేపీ నేతలతో కూడా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పలు కీలక విషయాల గురించి మాట్లాడనున్నారు. విమానాశ్రయంలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించడమే కాకుండా దాదాపు 26,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర విభాగం యోచిస్తోంది. దీనికి తగిన ఏర్పాట్లు చూడా చేస్తున్నదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం పేర్కొంది. అనంతరం అక్కడి నుంచి ప్రధానమంత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగి, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్లి అక్కడ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మాట్లాడుతూ.. “విమానాశ్రయంలో ప్రధానమంత్రి పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యే వేదికను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. షెడ్యూల్ ఆమోదం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపబడిందని తెలిపారు. హైదరాబాద్‌లో మోడీకి స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్స్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాని మోడీ ఆ పార్టీ బూత్‌స్థాయి అధికారులతో సమావేశం కావడం వారిని మరింత ఉత్సాహపర్చడంగా తెలుస్తోంది.